పిక్కలు పీకుడే.. | - | Sakshi
Sakshi News home page

పిక్కలు పీకుడే..

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

తొర్రూరు: తొర్రూరు పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వాటి సంతతి ఇబ్బడిముబ్బ డిగా పెరుగుతోంది. వీధుల్లో సంచరిస్తూ పాదచారులు, వాహనదారుల వెంటపడుతూ హడలెత్తిస్తున్నాయి. మహిళలు, వృద్ధులు, పిల్లలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఒంటరిగా వీధుల్లోకి రావాల ంటే పట్టణ ప్రజలు భయపడే పరిస్థితులున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు, రేబిస్‌ కేసుల తగ్గింపు కోసం 2023లో గత ప్రభుత్వం తొర్రూరు మున్సిపాలిటీలో రూ.20 లక్షలతో ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ) కేంద్రాన్ని నిర్మించింది. వీటిలో శునకాలకు సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉండగా.. దాన్ని విస్మరించారు. ఏబీసీ సెంటర్‌ నిర్మించిన కొద్ది రోజులకే ఆపరేషన్లు నిలిపివేసి నిరుపయోగంగా మార్చారు. ఫలితంగా శునకాల సంతతి పెరిగిపోయి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది.

నిరుపయోగంగా..

తొర్రూరులో పశువుల సంత సమీపంలో రూ.20 లక్షలతో ఏబీసీ సెంటర్‌ నిర్మించారు. 2023 ఆగస్టు వరకు సేవలు కొనసాగాయి. 200 కుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఒక్కో శునకానికి రూ.1,850 చొప్పున.. 200 శునకాలకు రూ.3.70 లక్షలు వెచ్చించినట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. పశువైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి నెలకు సుమారు 50 కుక్క కాటు బాధిత కేసులు వస్తున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 450 కేసులు వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. పలు కారణాలతో మూడేళ్లుగా ఆపరేషన్లు నిలిచిపోవడంతో ఏబీసీ కేంద్రం నిరుపయోగంగా మారింది. గడ్డి, పిచ్చి మొక్కలతో పరిసరాలు అధ్వానంగా మారా యి. పందులు, పశువులకు కేంద్రం ఆవాసంగా మారింది. రాత్రి వేళల్లో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రం అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తొర్రూరులో నిత్యం ఏదో ఒక కాలనీలో స్థానికులు కుక్క కాటుకు గురవుతున్నా.. ఏబీసీ సెంటర్‌లో కుక్కలకు శస్త్ర చికిత్సలు జరపడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు.

బాధ్యతే అయినా..

కుక్కల నియంత్రణ బాధ్యత మున్సిపాలిటీది అయినప్పటికీ సిబ్బంది కొరత, ఇతర కారణాలతో పట్టించుకోవడం లేదు. ప్రత్యేక సమయాల్లో ఒప్పంద పద్ధతుల్లో సిబ్బందిని నియమించుకునే ప్రతిపాదన ఉన్నా.. ఆ దిశగా ఎక్కడా ఆలోచించడం లేదు. వాటిని పట్టి తీసుకెళ్లే వాహనాలు సైతం లేవు. సంతాన నియంత్రణ చర్యలు అసలు జరగడం లేదు. శునకాల సమస్య తీవ్రతను బట్టి ఏటా రూ.5 లక్షల వరకు ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి యాంటీ రేబిస్‌ టీకాలు వేయించాలి. కానీ, ఈ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం ఇబ్బందిగా మారింది.

ఆపరేషన్లు చేసేందుకు చర్యలు

కుక్కల సంతానోత్పత్తిని తగ్గించేందుకు ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ సెంటర్‌లో కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించేలా చర్యలు చేపడతాం. ఇప్పటికే పశు వైద్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడాం. ఏజెన్సీ ద్వారా ఆపరేషన్లు చేపట్టేందుకు తీర్మానం చేశాం. ఏబీసీ సెంటర్‌ను వినియోగంలోకి తెస్తాం.

–వి. శ్యాంసుందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌

సమాచారం

మున్సిపాలిటీ

తొర్రూరు

వార్డులు 16

ఇళ్లు 6,756

జనాభా 30 వేలు

శునకాలు 1200

పెంపుడు శునకాలు 450

కుక్కల్లో సంతాన నియంత్రణ చర్యలు కరువు

తొర్రూరులో నిరుపయోగంగా

ఏబీసీ సెంటర్‌

పశు వైద్యులు లేరనే సాకు చూపుతున్న మున్సిపాలిటీ

శునకాల దాడులతో జనం బెంబేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement