నాడు అన్నదమ్ములు.. నేడు అక్కాచెల్లెళ్లు | - | Sakshi
Sakshi News home page

నాడు అన్నదమ్ములు.. నేడు అక్కాచెల్లెళ్లు

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

ములుగు: పాఠశాలలకు సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లల ఆటలు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చెరువులు, కుంటలు, ఫాంపాండ్‌లు ప్రమాదకరంగా ఉండడంతో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే నలుగురు విద్యార్థులు నీటిలో పడి మృతి చెందడం జిల్లాలో కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫాంపాండ్‌లో పడి మృతి చెందగా.. అంతకుముందు గణేశ్‌లాల్‌పల్లిలో అన్నదమ్ములు బహిర్భూమికి వెళ్లి మొండి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. చెల్లిని కాపాడబోయి అక్కా, తమ్ముడిని కాపాడబోయి అన్న నీటికుంటలలో పడి మృతిచెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు కళ్లముందే కన్నుమూయడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోతున్నారు. జిల్లాలో జరుగుతున్న వరుస విషాదాలతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఫాంపాండ్‌లో పడి అక్కాచెల్లెళ్లు..

తాజాగా ఆదివారం ములుగు మండలం కాసిందేవిపేటలో మరో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సీపీఐ నాయకుడు మహ్మద్‌ అమ్జద్‌పాషా తన కుటుంబ సభ్యులతో కలిసి పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేసేందుకు వెళ్లారు. తండ్రి వెంట కుమార్తెలు సమ్యాన్‌ (19), ఆసియా (10) పొలానికి వెళ్లారు. తండ్రి పొలంలో పనిచేస్తుండగా.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు సమీపంలోని పంట సాగునీటి నిల్వ కోసం తవ్విన ఫాంపాండ్‌(గుంత) వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వారు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. చివరకు ఫాంపాండ్‌ వద్దకు వెళ్లి చూడగా ఇద్దరూ నీటిలో మునిగిపోయినట్లు గుర్తించారు. వెంటనే బయటకు తీసి కాపాడేందుకు ప్రయత్నించినా.. అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

కలిసిరాని అదివారం..

రెండు కుటుంబాలు, నలుగురు విద్యార్థులు.. అదివారం సెలవుదినం కావడంతో అమ్మమ్మ ఇంటివద్ద ఉండి ఇద్దరూ.. తండ్రితో పొలం వద్దకు వెళ్లి మరో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వరుస ఘటనలతో జిల్లాలోని తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో ముఖ్యంగా ప్రమాదకర నీటి వనరుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు.. పాఠశాలల సెలవుల సమయంలో విద్యార్థులకు నీటి ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు కాసిందేవిపేటలో అక్కాచెల్లెళ్ల మృతి విషయాన్ని తెలుసుకున్న మంత్రి సీతక్క ఫోన్‌లో కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇద్దరు పిల్లలను కోల్పోయిన అమ్జద్‌పాషాకు ధైర్యం చెబుతూ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, ములుగు ఆస్పత్రిలో ఉన్న పిల్లల మృతదేహాలకు నివాళులర్పించారు.

విద్యార్థులను మింగేస్తున్న

కుంటలు, చెరువులు

20 రోజుల్లోనే నలుగురు

విద్యార్థుల మృత్యువాత

ఒకే కుటుంబానికి చెందిన

అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లను

మింగేసిన నీటికుంటలు

అన్నదమ్ముల మృతితో రెండు గ్రామాల్లో విషాదం

ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గణేశ్‌లాల్‌పల్లిలో గత నెల ఆగస్టు 30న మొండికుంటలో పడి అన్నదమ్ములు మృతిచెందారు. మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన మాలోతు స్వాతి తమ పిల్లలు వినయ్‌ (15), రాజేశ్‌ (12)లను తీసుకుని గణేశ్‌లాల్‌పల్లిలోని తన సోదరునికి రాఖీ కట్టేందుకు వచ్చింది. వరుసగా సెలవులు ఉండడంతో పిల్లలను అక్కడే ఉన్న అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచి స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఆగస్టు 30(ఆదివారం సాయంత్రం)న బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడిన సోదరుడు రాజేశ్‌ను కాపాడబోయి వినయ్‌ సైతం కుంటలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement