ఖాళీగా వెళ్లే రైలు.. కనెక్టివిటీ కోసం జనం! | - | Sakshi
Sakshi News home page

ఖాళీగా వెళ్లే రైలు.. కనెక్టివిటీ కోసం జనం!

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

బల్లార్షాలో గంటల తరబడి నిలిచే నందిగ్రామ్‌.. కాజీపేట వరకు నడిపితే..

కరీంనగర్‌ నుంచి ఆసిఫాబాద్‌ వరకు.. ముంబై–నాసిక్‌–షిరిడీకి సౌకర్యం

కాజీపేటలో సిద్ధమైన పిట్‌లైన్లు.. బల్లార్షా– కాజీపేట మూడో మార్గం

సాక్షిప్రతినిధి, వరంగల్‌: రైలు ఉంది.. మార్గం ఉంది.. మౌలిక వసతులు ఉన్నాయి.. కానీ, ప్రయాణికులకు కావాల్సిన కనెక్టివిటీ మాత్రం అందుబాటులో లేదు. బల్లార్షా వరకు వస్తున్న నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు పొడిగించాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉన్నా.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. బల్లార్షాలో రైలు తిరుగు ప్రయాణానికి ముందు దాదాపు 20 గంటలపాటు ఖాళీగా ఉండే సమయాన్ని కాజీపేట వరకు సర్వీస్‌గా వినియోగిస్తే తెలంగాణలోని ఉత్తర ప్రాంత ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ ప్రాంతాల నుంచి ముంబై, నాసిక్‌, షిరిడీ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రస్తుతం పలు మార్గాలు మార్చుకోవాల్సి వస్తోంది. నందిగ్రామ్‌ను కాజీపేట వరకు పొడిగిస్తే ఈ ప్రాంతాల ప్రయాణికులకు నేరుగా ఉత్తర–పడమర మహారాష్ట్రతో రైలు అనుసంధానం ఏర్పడుతుంది.

కాజీపేటకు వస్తే.. కరీంనగర్‌ నుంచి ముంబై బాట

నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట వరకు వస్తే కరీంనగర్‌–పెద్దపల్లి–మంచిర్యాల–ఆసిఫాబాద్‌ ప్రాంతాల ప్రయాణికులకు ప్రత్యేక ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ముంబయి, నాసిక్‌, షిరిడీ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సులు, ఇతర రైళ్లు, మార్గమధ్య మార్పులపై ఆధారపడాల్సి వస్తోంది. నేరుగా రైలు అందుబాటులోకి వస్తే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వైద్య సేవల కోసం వెళ్లే వారు, పర్యాటకులు, కుటుంబ ప్రయాణికులకు ప్రయాణం సులభతరం కానుంది.

కాజీపేటలో అన్ని వసతులు..

మూడు ప్రాంతాలకు ఒకే కనెక్టివిటీ

నందిగ్రామ్‌ వంటి రైలును కాజీపేట వరకు పొడిగించేందుకు అవసరమైన పిట్‌లైన్‌న్‌, రైళ్ల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు కాజీపేటలో ఉన్నాయి. ఇదే సమయంలో బల్లార్షా–కాజీపేట మధ్య మూడో రైల్వే మార్గం సిద్ధం కావడంతో ఈ మార్గంలో రైళ్ల నిర్వహణ సామర్థ్యం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాజీపేట–కరీంనగర్‌–ఆసిఫాబాద్‌ ప్రాంతాలను మహారాష్ట్రలోని బల్లార్షా–నాసిక్‌–ముంబై ప్రాంతాలతో అనుసంధానించేలా నందిగ్రామ్‌ సర్వీసును వినియోగించాలన్నది ప్రధాన డిమాండ్‌. ఇది కేవలం వరంగల్‌ లేదా కాజీపేట ప్రయాణికుల సమస్యగా కాకుండా ఉత్తర తెలంగాణలోని పెద్ద ప్రాంతానికి సంబంధించిన రైల్వే కనెక్టివిటీ అంశంగా చూడాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. కొత్త రైలును పూర్తిగా ప్రారంభించడంతో పోలిస్తే ఇప్పటికే నడుస్తున్న సర్వీసును అందుబాటులో ఉన్న సమయాన్ని వినియోగిస్తూ పొడిగించే అవకాశాన్ని రైల్వే శాఖ పరిశీలించాలని కూడా వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement