తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న | - | Sakshi
Sakshi News home page

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

గీసుకొండ: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ అన్న తన సొంత తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన ఘటన గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ గరీబ్‌నగర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గరీబ్‌నగర్‌కు చెందిన ఏలుబాక రాజయ్య,సుజాత దంపతులకు ముగ్గురు కుమారులు ఉండగా రాజయ్యతో పాటు వారి పెద్ద కుమారుడు గతంలో అనారోగ్యంతో మృతి చెందారు. రెండో కుమారుడు ఎలుబాక ప్రవీణ్‌ వెల్డింగ్‌ పనులు చేస్తూ కీర్తినగర్‌లో ఉంటుండగా అతడి తమ్ముడు ప్రసాద్‌(31) వెల్డింగ్‌ పనులు చేస్తూ గరీబ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. నిందితుడు ప్రవీణ్‌ తరచుగా గరీబ్‌నగర్‌కు వెళ్లి తమ్ముడితో గొడవపడేవాడు. తన తమ్ముడి వద్ద ఉంటున్న తల్లి సుజాత వద్దకు వెళ్లి మద్యం తాగడానికి డబ్బులు అడిగే వాడు. అయితే నెలరోజులుగా తమ్ముడు పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్నాడని, డబ్బులు ఎలా వస్తాయంటూ అతడికి తల్లి నచ్చజెప్పేది. శనివారం రాత్రి ప్రవీణ్‌ అతిగా మద్యం సేవించి తమ్ముడు (ప్రసాద్‌) ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. పనికి ఎందుకు వెళ్లడం లేదంటూ మందలించడమే కాకుండా ఆవేశంతో వెంట తెచ్చుకున్న కత్తితో తమ్ముడి వీపు, ఛాతి ఎడవవైపు, ఎడమ భుజం వద్ద పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం మృతుడి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా గాలింపు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement