జనగామ : ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతురాలి భర్త శ్రీనివాస్, కూతురు జ్యోతి, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపల్లి మండలం నక్కబొక్కల తండాకు చెందిన గుగులోత్ మంజుల(28)కు ఐదు రోజుల క్రితం కడుపు నొప్పి రావడంతో ఎర్రగొల్లపాడుకు చెందిన ఆర్‌ఎంపీ రమేశ్ సూచన మేరకు జనగామలోని సంధ్య ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం గర్భసంచిలో తెల్లటి బుడగలు ఉన్నాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారి అంగీకారంతో ఆపరేషన్ నిర్వహించి ఐదు రోజులపాటు ఆస్పత్రిలో ఉంచిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన మరుసటి రోజే మంజులకు జ్వరం, వాంతులు రావడంతో కుటుంబ సభ్యులు తిరిగి అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం పరిస్థితి బాగానే ఉందని చెబుతూనే ఆస్పత్రి యాజమాన్యమే అంబులెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని స్పార్క్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు రక్తంలో ఇన్‌ఫెక్షన్ ఉందని చెప్పడంతో పాటు జనగామలో ఎక్కడ, ఎవరు ఆపరేషన్ చేశారనే విషయాలను ఆరా తీశారు. సంధ్య ఆస్పత్రి వైద్యుల సూచన మేరకే ఆపరేషన్ చేయించినట్లు హైదరాబాద్ వైద్యులకు కుటుంబీకులు వివరించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం మంజుల మృతి చెందింది.
మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన..
మంజుల మృతదేహాన్ని జనగామకు తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు, తండావాసులు సంధ్య ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోకి మృతదేహాన్ని తీసుకెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న వైద్యులు, సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబీకులు సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి ఎస్సైలతో కలిసి ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆపరేషన్ చేసిన వైద్యుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
ఆస్పత్రి నిర్వహణపై ఆరోపణలు..
సిద్దిపేట రోడ్డులోని ఓ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో చిన్న గదిలో, సరైన వెంటిలేషన్ సదుపాయాలు లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. సంధ్య ఆస్పత్రి పేరిట బోర్డుపై ముగ్గురు వైద్యుల పేర్లు ఉన్నప్పటి కీ, ఆపరేషన్ విషయంలో అర్హత లేని (ఆపరేషన్‌కు) ఓ విభాగానికి చెందిన వైద్యుడు పాల్గొన్నట్లు కు టుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి నిర్వహణ, వైద్యుల అర్హతలు, ఆపరేషన్ చేసిన వైద్యుడి వివరాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కా గా, సదరు వైద్యుడిపై ఇలాంటి విషయంలో ఆరోపణలు సైతం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆర్‌ఎంపీల రెఫర్‌పై ఆగ్రహం..
కమిషన్ల కోసం పలువురు ఆర్‌ఎంపీలు ఇలాంటి ఆస్పత్రులకు రోగులను రెఫర్ చేస్తున్నారని కుటుంబీకులు ఆరోపించారు. అర్హతలు, సదుపాయాలు, అనుమతులపై పరిశీలన లేకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయడంతో పేద కుటుంబాలు నష్టపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జనగామలో లింగ నిర్ధారణ పరీక్షల వ్యవహారంలో ఓ మహిళ మృతిచెందిన ఘటనకు సంబంధించి అర్హతలేని ప్రైవేట్ ఏఎన్‌ఎం, ఆర్‌ఎంపీ సహా పలువురిపై కేసులు నమోదైన నేపథ్యంలో, తాజాగా మరో మహిళ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.
జనగామలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన
మృతదేహంతో బంధువుల ఆందోళన


