ప్రతీ పౌరుడికి హక్కులు అందేలా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతీ పౌరుడికి హక్కులు అందేలా పనిచేయాలి

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

ఘన స్వాగతం..

మరిపెడ/మరిపెడ రూరల్‌: ప్రజలకు న్యాయవస్థను మరింత చేరువ చేయడంతోపాటు పెండింగ్‌ కేసులు పరిష్కారంలో వేగం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, మహబూబాబాద్‌ జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్‌ ఈ.వి.వేణుగోపాల్‌ అన్నారు. బార్‌, బెంచ్‌ మధ్య సమన్వయం బలోపేతం అయిప్పుడే కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతన జూనియర్‌ సివిల్‌ జడ్జి–కమ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు భవనాన్ని జస్టిస్‌ ఈ.వి. వేణుగోపాల్‌, జస్టిస్‌ ఎన్‌. రాజేశ్వర్‌రావు, జస్టిస్‌ బి.ఆర్‌.మధుసూదన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఈ.వి.వేణుగోపాల్‌ మాట్లాడుతూ న్యాయవాదులు కేవలం కక్షిదారుల తరఫున వాదించేవారే కాకుండా ‘ఆఫీసర్‌ ఆఫ్‌ ది కోర్టు’గా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన మరిపెడ కోర్టు పరిధిలో ప్రస్తుతం 1,903 కేసులు ఉన్నాయని, మరోమారు తాము కోర్టును సందర్శించే సమయానికి కనీసం 1,000 కేసులు పరిష్కరించేలా పని చేయాలన్నారు. భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కులు, న్యాయ రక్షణలు సమానంగా అందేలా చూడడం న్యాయవ్యవస్థ బాధ్యతని పేర్కొన్నారు.

సామాజిక స్పృహతో వ్యవహరించాలి..

నేటి కార్పొరేట్‌ కల్చర్‌ యుగంలో న్యాయవాదులు సామాజిక స్పృహ కలిగి కక్షిదారులకు న్యాయం చేయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వరావు అన్నారు. దేశంలో రోజురోజుకూ కక్షిదారులు పెరిగి పోతున్నారని, నేటికి దేశ వ్యాప్తంగా 5.3 కోట్ల కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం అత్యంత ఆవశ్యకమన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలోని తన స్వగ్రామం సూదనపల్లి వాసిగా మరిపెడతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, స్వగ్రామ ప్రాంతంలో న్యాయస్థానం ఏర్పాటవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

మరిపెడకు తగ్గిన దూరభారం..

మరిపెడ ప్రజలు కోర్టు పేషీల కోసం 45 కిలో మీటర్లు ప్రమాణం, సమయం, ఖర్చు చేసి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, జస్టిస్‌ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో మరిపెడలో కోర్టు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత వాసులకు సత్వర సేవలు అందుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌. మధుసూదన్‌రావు అన్నారు. ఈ కోర్టు పరిధిలో మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట, సీరోలు మండలాలకు సంబంధించి నాలుగు పోలీస్‌ స్టేషన్లకు చెందిన 2,000 కేసులు జ్యుడీషియల్‌కు కేటాయిస్తారన్నారు.

అంతకు ముందు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో హైకోర్టు న్యాయమూర్తులకు ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రామచంద్రునాయక్‌, కలెక్టర్‌ స్నేహశబరీశ్‌ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ అండ్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి డి.కె.మురళీమోహన్‌, న్యాయమూర్తులు శాలిని షాకెల్లి, స్వాతిమురారి, కృష్ణతేజ్‌, ధీరజ్‌కుమార్‌, జీవన్‌కుమార్‌, మహతి వైష్ణవి, అఖిల్‌, దిలీప్‌కుమార్‌ నాయక్‌, సూర్యచంద్రకళ, కిరణ్‌లాల్‌, చండేశ్వరీదేవి, జోస్స్న, ఎస్పీ శబరీశ్‌, తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ ఈ.వి.వేణుగోపాల్‌

మరిపెడలో నూతన సివిల్‌ కోర్టు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement