కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.198 కోట్ల వ్యయంతో చేపడుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విజయగణపతి, ప్రధాన ఆలయం గర్భగుడి, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి పునాది పనులు రాళ్లతో చేపట్టారు. అతి త్వరలో పునాది పనులు పూర్తి కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట నుంచి శనివారం 96 టన్నుల కృష్ణశిల కాళేశ్వరానికి చేరుకుంది. ఒక్క రాయి 10 ఫీట్ల పొడవు, మూడు ఫీట్ల వెడల్పు, రెండు ఫీట్ల ఎత్తుతో నాలుగు టన్నుల వరకు బరువు ఉంటుందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. ఈ రాతి నిర్మాణం కోసం ఇప్పటికే కూలీలు కాళేశ్వరం చేరుతున్నారు. రాయి అతికేందుకు లైమ్, లేదా సిమెంట్‌తో చేయడానికి డిజైన్స్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. రాతి నిర్మాణం చేసే మేసీ్త్ర ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాగా, ఆయన ఇప్పటికే యాదాద్రి, మేడారం తదితర ఆలయాల పనులు చేయడంతో ఆయనకే అప్పగించినట్లు తెలిసింది. దీంతో ఆలయ నిర్మాణ పనులు వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా పనులు పూర్తి చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధమవుతున్నారు.


