గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

● యువకుడి మృతి.. ఒకరికి తీవ్రగాయాలు

● యువకుడి మృతి.. ఒకరికి తీవ్రగాయాలు

గూడూరు: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారి మూలమలుపు వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ముల విష్ణు (24), చెంద్రుగూడెం ఎస్సీ కాలనీకి చెందిన సదువాల భానూప్రకాశ్‌ బైక్‌పై ప్రధాన బస్టాండ్‌ సెంటర్‌లోని మూలమలుపునకు చేరుకున్నారు. అదే సమయంలో వెనకాల నర్సంపేట నుంచి మహబూబాబాద్‌ వైపు ఎర్రమట్టి లోడ్‌తో వెళ్తున్న లారీ.. వారి బైక్‌ను పక్కనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న కొమ్ముల విష్ణు లారీ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. వెనకాల కూర్చున్న సదువాల భానుప్రకాశ్‌ లారీకి కొద్దిదూరంలో పడడంతో అతని కుడిచేతిపై నుంచి లారీ చక్రాలు వెళ్లాయి. స్థానికులు భానుప్రకాశ్‌ను సీహెచ్‌సీకి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై గిరిధర్‌రెడ్డి రాకపోకలకు అంతరాయం కలుగకుండా, ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. ఇదిలా ఉండగా గత సంవత్సరమే విష్ణు తండ్రి కొమ్ముల శ్రీను మృతిచెందగా.. తల్లి రేణుక, చెల్లితో హైదారబాద్‌లో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల నానమ్మ ముత్తమ్మ ఇంటికి పనిపై వచ్చాడు. మృతుడి నానమ్మ కొమ్ముల ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.

బైకు ఢీకొని వ్యక్తి మృతి

బచ్చన్నపేట : నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్‌ ఢీకొనగా మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచన్నపేటకు చెందిన మల్యాల బాలయ్య (56) రాత్రి కిరాణ షాపునకు వెళ్లి వస్తుండగా.. నారాయణపురం గ్రామ మూలమలుపు వద్ద ఆలేరు వైపు నుంచి వస్తున్న బైక్‌ ప్రమాదవశాత్తు బలంగా ఢీకొట్టింది. గాయపడ్డ బాలయ్యను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలయ్యకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement