ఖాళీ పోస్టులు.. అస్తవ్యస్తంగా సేవలు | - | Sakshi
Sakshi News home page

ఖాళీ పోస్టులు.. అస్తవ్యస్తంగా సేవలు

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

ప్రతిపాదించినా.. పట్టింపులేదు..

హన్మకొండ: కీలక పోస్టుల ఖాళీతో తెలంగాణ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ (టీజీ ఎన్పీడీసీఎల్‌) అస్తవ్యస్తంగా తయారైంది. వేలాది పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉండటంతో విద్యుత్‌ సేవలు, నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత కారణంగా వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పోస్టుల భర్తీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘాలు, వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో 2,090కు పైగా జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులు, 1,900కు పైగా సబ్‌స్టేషన్‌ ఆపరేటర్లు, సుమారు 100 చొప్పున అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), సబ్‌ ఇంజనీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (జేఏఓ) పోస్టులూ భర్తీకి నోచుకోలేదు.

వినియోగదారులకు తప్పనితిప్పలు..

విద్యుత్‌ వినియోగదారులకు నేరుగా సేవలు అందించే జేఎల్‌ఎంల కొరత అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌కు స్పందించడం, తెగిపోయిన విద్యుత్‌ లైన్ల మరమ్మతులు, కాలిపోయిన డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల పునరుద్ధరణ, దెబ్బతిన్న కేబుళ్ల మరమ్మతులు, గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్‌ అంతరాయాల పరిష్కారం వంటి కీలక బాధ్యతలు జేఎల్‌ఎంలపైనే ఉంటాయి. ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉండటంతో సకాలంలో సేవలు అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్‌స్టేషన్‌ ఆపరేటర్ల కొరత కూడా విద్యుత్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వందలాది పోస్టులు ఖాళీగా ఉండటంతో కొత్తగా నిర్మించిన పలు సబ్‌స్టేషన్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం లేదు. అయిదుగురు ఆపరేటర్లు పని చేయాల్సిన సబ్‌ స్టేషన్‌ను ఒక్కరిద్దరితో నెట్టుకొస్తుండడం గమనార్హం.

నత్తనడకన అభివృద్ధిపనులు..

సెక్షన్‌ స్థాయిలో సాంకేతిక పర్యవేక్షణ నిర్వహించే ఏఈ, సబ్‌ ఇంజనీర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో నిర్వహణ, తనిఖీలు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్క్‌ ఆర్డర్‌ తీసుకునే వారు లేక అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. మరోవైపు జూనియర్‌ అసిస్టెంట్‌, జేఏఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో కార్యాలయ పరిపాలనా పనులు సైతం నిమ్మదిస్తున్నాయి.

సంస్థలో ఖాళీల భర్తీకి అనుమతి ఇవ్వాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఇవి కొత్త పోస్టులు కాకుండా రిటైర్‌మెంట్‌, పదోన్నతులు, ఇతర కారణాలతో ఖాళీ అయిననే వీటిని భర్తీ చేసినా ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడదు. అయినప్పటికీ నియామకాలు చేపట్టకపోవడంలో అంతర్యమేమిటనే సందేహం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించకపోవడంతో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే రెగ్యులర్‌ నియామకాలకు సమ యం పట్టినా, కనీసం సబ్‌స్టేషన్‌ ఆపరేటర్లను అవు ట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమిస్తే కొత్త సబ్‌స్టేషన్‌లు పూర్తిస్థాయిలో పనిచేసి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

టీజీఎన్పీడీసీఎల్‌లో ఖాళీగా

4000పైగా పోస్టులు

కీలక పోస్టుల ఖాళీతో విద్యుత్‌ సేవలపై తీవ్రప్రభావం

2,090 జేఎల్‌ఎం, 1,900 సబ్‌ స్టేషన్‌ ఆపరేటర్లు, 100 చొప్పున ఏఈ,

సబ్‌ ఇంజనీర్‌ పోస్టులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement