మహబూబాబాద్: యాప్‌లతో పాటు పనిభారంతో పంచాయతీ కార్యదర్శుల సతమతమవుతున్నారు. డీఎస్‌ఆర్ యాప్‌లో ఉదయం 11 గంటలకు అటెండెన్స్ వేయాల్సి ఉండగా.. నాలుగు రోజుల క్రితం ఉదయం 9గంటలకు మార్చారు. దీంతో ఉదయం హడావుడిగా కార్యాలయాలకు వస్తున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ఈమేరకు ఆందోళన బాటపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కార్యాలయంలో 36 రికార్డుల నిర్వహణ, పెరిగిన గ్రామసభలతో పాటు ఆన్‌లైన్ యాప్‌లతో సతమతమవుతున్నామని వారు చెబుతున్నారు.
482 జీపీలు..
జిల్లాలోని 18 మండలాల్లో 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 6,35,872 మంది ఉన్నారు. ఆయా జీపీలకు గాను 406 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. మిగిలిన జీపీలకు ఇన్‌చార్జ్‌లతో నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీ వ్యవస్థలో కార్యదర్శులు కీలక పాత్ర పోషిస్తున్నా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలక వర్గంతో కలిసి లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నారు.
పెరిగిన పని భారం..
గతంలో సంవత్సరానికి నాలుగుసార్లు జరిగే గ్రామ సభలు ఇప్పుడు వారానికి రెండు నుంచి నాలుగు సార్లు పెట్టాల్సి వస్తోంది. వాటిని యాప్‌లలో ఆన్‌లైన్ చేయాలి. దీంతో తీవ్ర ఒత్తిడి పెరిగిందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి జీపీలో కోరం ఉంటేనే గ్రామ సభలు నిర్వహించాలి. కానీ, గ్రామ సభలు కూడా అధికారిక ఒత్తిడితో నిర్వహించాల్సి వస్తోందని వారు అంటున్నారు. ఉదాహరణకు జీపీ స్వాప్ గ్రామసభ, జీపీడీపీ గ్రామసభ, వీబీపీ రామ్ జీ గ్రామ సభ, అంబేడ్కర్ జయంతి గ్రామసభ, గాంధీ జయంతి సభ , పర్యావరణ సభ, మహిళా గ్రామసభ తదితర సభలు నిర్వహిస్తున్నారు.
యాప్‌లతో ఒత్తిడి..
● ఉదయం 9గంటలకే జీపీలో డీఎస్‌ఆర్ యాప్‌లో అటెండెన్స్ నమోదు చేసుకోవాలి.
● ఇందిరమ్మ ఇళ్ల యాప్ నిర్వహణ, ఎస్‌బీఎం యాప్ నిర్వహణ, జీపీ స్వాప్, జీపీడీపీ ఆన్‌లైన్ వర్క్స్.
● ఎస్‌బీఎం గ్రామీణ్ యాప్, పీఎస్‌జీపీ మానిటరింగ్ యాప్, నిర్ణయ్ యాప్, మిషన్ భగీరథ యాప్, ఎం యాక్షన్ యాప్, మేరీ పంచాయతీ యాప్, ఐఎఫ్‌ఎంఐఎస్ యాప్, చేయూత యాప్.
● చీటికి మాటికి గ్రామసభలు, గ్రామ స్వరాజ్ ఆన్‌లైన్ వర్క్స్.
● సెగ్రిగేషన్, ట్రాక్టర్ నిర్వహణ, ఆఫీస్‌లో 36 రికార్డుల నిర్వహణ.
ఇతర పనులు..
సర్ ప్రక్రియ, పింఛన్ ఆప్లికేషన్ స్వీకరణ, ఆన్‌లైన్ , వీబీజీ రామ్‌జీ తీర్మానాలు, ఇంకుడుగుంతలు, ఊర కుంటలు, పంట కుంటల టార్గెట్స్. కుక్కలు, కోతుల సర్వేలు, మరుగుదొడ్ల సర్వేతో యాప్‌లో నమోదు.
డీపీఓ కార్యాలయంలో పలు ఫైళ్లు పెండింగ్..
ఉద్యోగరీత్యా రావాల్సిన బెనిఫిట్స్, జేపీఎస్‌ల ప్రొబేషన్ డిక్లేర్, ఉద్యోగుల మెడికల్ బిల్స్ డీపీఓ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. డిప్యుటేష్ ఫైళ్లతో పాటు పలు బిల్లుల ఫైళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయాలని కోరుతున్నారు.
ఉదయం 9 గంటలకు అటెండెన్స్
గతంలో అటెండెన్స్ విషయంలో మంత్రి సీతక్క ఉదయం 11గంటల వరకు వెసులుబాటు కల్పించారు. తిరిగి సంబంధిత అధికారులు మళ్లీ ఉదయం 9గంటలకే అటెండెన్స్ అమలు చేస్తున్నారు. సమయానికి రాకుంటే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. దీంతో చేసేది ఏమీ లేక ఆగమేఘాల మీద వెళ్లాల్సి వస్తోందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి
ఉదయం 9 గంటలకే డీఎస్‌ఆర్ యాప్‌లో అటెండెన్స్
ఆఫీస్‌లో 36 రికార్డుల నిర్వహణ
సతమతమవుతున్న కార్యదర్శులు
జిల్లాలో 482 జీపీలకు..
406 మంది సిబ్బంది


