సాక్షి, మహబూబాబాద్ : కాలం మారింది.. పరిస్థితులు మారాయి.. జీవన విధానం మారింది.. వివాహాల పద్ధతులు మారాయి.. పని ఒత్తిడి.. తదితర కారణాలతో జిల్లాలో జననాల సంఖ్య తగ్గుతోంది. వివాహిత గర్భం దాల్చిన నాటి నుంచి శిశువు పుట్టి సంపూర్ణ ఆరోగ్యంతో తల్లీబిడ్డలను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించడంలో ఆశ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మాతా, శిశు మరణాలను తగ్గించాలనే ఆలోచనతో నెలతప్పిన ప్రతీ మహిళను నమోదు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఈ టార్గెట్ ఆశ వర్కర్ల పాలిట శాపంగా మారింది. ఎప్పుడు ఎవరి నోటినుంచి శుభవార్త వస్తుందో అని ఆశవర్కర్లు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.
ఏఎంసీ టార్గెట్లు..
ప్రతీ ఇంటికి ప్రభుత్వ వైద్యం, సేవలు అందించాలనే అలోచనతో ప్రతీ వెయ్యిమంది జనాభాకు ఒక ఆశవర్కర్‌ను నియమించారు. జిల్లా వ్యాప్తంగా 895 మందిని నియమించారు. ఇప్పటి వరకు గర్భిణులు, బాలింతలకు వ్యాక్సినేషన్, ఆరోగ్య సర్వేలు, పల్స్‌పోలియో, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారికి మందుల పంపిణీ, గర్భం దాల్చిన ప్రతీ మహిళ ఆస్పత్రిలో ప్రసవం జరిపించేలా చూడాలి. అయితే రోజువారి పనులు చేస్తున్నా.. ఏఎంసీలు(గర్భిణులు) నమోదు పెంచాలనే టార్గెట్ పెట్టారు. ప్రతీ ఆశవర్కర్ నెలకు కనీసం మూడుకు తగ్గకుండా నమోదు చేయాలని, అలా చేస్తేనే జీతం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంట్లో పెళ్లి జరిగిన నాటి నుంచి ప్రతీ నెల వెళ్లి శుభవార్త చెబుతారా అనే పరిస్థితి నెలకొంది. పదే పదే ఇంటికి వెళ్లి అడగడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, కొందరైతే.. పంచాయితీలు కూడా పెట్టుకుంటున్నారని ఆశవర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గర్భందాల్చేందుకు ఆలస్యం..
గతంలో చిన్నతనంలోనే వివాహాలు జరిగేవి. కానీ, ఇప్పుడు 25 సంవత్సరాల లోపు మహిళలు, 30 సంవత్సరాలలోపు పురుషులు వివాహం చేసుకునే వారి సంఖ్య చాలా అరుదు. చదువులు, ఉద్యోగాల వేట, కుటుంబ పోషణ భారం కావొద్దని, కుటుంబ బాధ్యతలు మీదపడడం వంటి పరిస్థితుల్లో కొందరు అయితే 40 సంవత్సరాలు వచ్చినా వివాహాలు చేసుకోవడం లేదని లెక్కలు చెబుతున్నాయి. వివాహాలు ఆలస్యం కావడం, ఉరుకులు పరుగుల జీవితాలతో భార్యాభర్తలు ఒత్తిడికి గురై త్వరగా గర్భం దాచ్చడం లేదు. ఇటీవల పలు సంస్థలు వివాహాల ఆలస్యం, గర్భం దాల్చడం మొదలైన వివరాలకోసం సర్వేలు నిర్వహించారు. ఈమేరకు జిల్లాలో 30శాతం మంది యువతీ, యువకులు ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నట్లు తేలింది.
జిల్లా వివరాలు
ఆశ వర్కర్లకు గర్భిణుల వివరాల
నమోదులో ఇబ్బందులు
ప్రతీ నెల టార్గెట్ పూర్తిచేయాలని అధికారుల ఒత్తిడి
వయసు మీరిన తర్వాత వివాహాలతో ప్రెగ్నెన్సీ ఆలస్యం
రోజురోజుకూ తగ్గుతున్న
గర్భిణులు సంఖ్య
టార్గెట్లు తగ్గించాలని సిబ్బంది విజ్ఞప్తి
జిల్లాలో వివాహాలు, సంతానోత్పత్తి 2019–21 2023–24
18ఏళ్లలోపు వివాహమైన యువతులు 28.3శాతం 15.8శాతం
గత పదేళ్లలో ముగ్గురికన్నా ఎక్కువ పిల్లలు 0.5శాతం 2.0శాతం
15–19సంవత్సరాల వయసులో గర్భిణుల శాతం 6.6శాతం 5.4శాతం
పిల్లలు వద్దు అనుకునే వారు 2.5శాతం 2.7శాతం


