కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భద్రకాళీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు. భక్తులకు వినోదాన్ని అందించేందుకు హరికథను ఏర్పాటు చేశారు.
కదిలిన యంత్రాంగం
డోర్నకల్: డోర్నకల్ పట్టణానికి మున్నేరువాగు నీరు సరఫరా చేసేందుకు మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు చేపట్టారు. తాగునీటి ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో ‘మున్సిపాలిటీకి భగీరథ కష్టాలు’ అనే శీర్షికన ఆదివారం ప్రచురితమైన కథనంపై స్పందించిన సిబ్బంది విద్యుత్ మోటార్లు, పైపుల మరమ్మతులు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్నేరువాగు నుంచి వచ్చే పైపులైన్‌కు నీటి సంప్, ఓవర్ హెడ్ ట్యాంకు పైపులకు అనుసంధానం చేసే పనులు చేపట్టారు. రెండు రోజుల్లో మున్నేరువాగు నుంచి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని మున్సిపల్ సిబ్బంది, పాలకవర్గం సభ్యులు తెలిపారు.
కేసముద్రం మార్కెట్ పాలకమండలి గడువు పొడిగింపు
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పాలక మండలి పదవీకాలం మరో 6 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కేసముద్రం మార్కెట్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ఆదివారం తెలిపారు. 2024 సెప్టెంబర్ 19న కేసముద్రం మార్కెట్ చైర్మన్‌గా గంట సంజీవరెడ్డితోపాటు వైస్‌చైర్మన్‌గా పెద్దబోయిన ఐలయ్య, డైరెక్టర్‌లుగా సంకెపల్లి నారాయణరెడ్డి, చింతకుంట్ల యాదగిరి, ఎండి.అయూబ్‌ఖాన్, భూక్య అనిత, గోపి మధుసూదన్, అవుల శ్రీనివాస్, గడ్డం వెంకట్‌రెడ్డి, కాకి విజయ, కొట్టం రాము, గుగులోతు వీరన్న, చిదురాల వసంతరావు, వోలం రమేశ్‌ను నియమించారు. కాగా, గత సెప్టెంబర్ 19న మార్కెట్ పాలక మండలి పదవీకాలం గడువు ముగిసింది. ఈ క్రమంలో మరో 6 నెలల పాటు పాలక మండలి పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
జిల్లా స్పోర్ట్స్ కరాటే
అసోసియేషన్ కమిటీ
మహబూబాబాద్ అర్బన్: జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ నూతన కమిటీని జిల్లా కేంద్రంలోని ఓసీ క్లబ్‌లో ఆదివారం ఎన్నుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉరుగొండ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా బి.అజయ్‌సారథిరెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా పి.వీరునాయక్, ప్రధాన కార్యదర్శిగా సోమ శ్రీధర్, కోశాధికారిగా సాయిచంద్, కార్యదర్శిగా సాయిప్రకాశ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాయం సురేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
జీఎంసీకి మృతదేహం అప్పగింత
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మృతదేహాన్ని లయన్స్‌క్లబ్, స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అప్పగించారు. జిల్లా కేంద్రానికి చెందిన మోత్కూరు పరమేశ్వర్(60) అనారోగ్యంతో మృతిచెందారు. మృతుడి సోదరుడు ప్రభాకర్ మృతదేహాన్ని జీఎంసీకి అప్పగించేందుకు ముందుకు వచ్చారు. కార్యక్రమంలో కొండపల్లి కేశవరావు, పారుపల్లి రమేష్‌బాబు, వంగాల పూర్ణాచారి, బండోజు ఉపేంద్రచారి, జీజీహెచ్ ఆర్‌ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, పర్కాల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


