తిరుమలగిరి(తుంగతుర్తి): అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన వడియాల శ్రీనివాస్ (59) భార్య సోమలక్ష్మి (52)తో కలిసి తిరుమలగిరికి వలస వచ్చి ఇక్కడే కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు శ్రావణ్ తన భార్యతో కలిసి గ్రామంలోనే వేరే ఇంట్లో నివాసం ఉంటూ తండ్రి కిరాణం చూసుకుంటున్నాడు. కుమార్తెకు పెళ్లికాగా వారు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొంత కాలంగా శ్రీనివాస్, సోమలక్ష్మి ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్లకు ఉరేసుకున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి పిలవగా ఎవరూ రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూశాడు. భార్యాభర్తలిద్దరూ ఫ్యాన్లకు వేలాడుతూ కనిపించారు. వెంటనే వారి కుమారుడు శ్రావణ్‌కు సమాచారం ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని, ఆ బాధ భరించలేకనే చనిపోతున్నామని, త మ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనారోగ్య సమస్యలతో
దంపతుల ఆత్మహత్య


