● పార్లమెంట్‌లో వరంగల్ ఎంపీ కావ్య ప్రశ్న
కాశిబుగ్గ: వరంగల్ జిల్లాలో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. జిల్లాలో ఆయుష్ సేవల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతమేరకు నిధులు కేటాయించింది..? ఎలాంటి మౌలిక వసతులు కల్పించారు? ఆయుష్ సేవలను సాధారణ వైద్య వ్యవస్థతో ఎలా అనుసంధానం చేస్తోంది..? అనే అంశాలపై శుక్రవారం ఆమె ప్రశ్నలను లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్‌ఎఎం) కింద వరంగల్ జిల్లాలో 9 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల భవనాల మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం, శాశ్వత యోగా షెడ్ల నిర్మాణానికి కేంద్రం మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో అదనపు బ్లాక్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆస్పత్రి, ప్రభుత్వ ఆయర్వేద వైద్య కళాశాల అభివృద్ధితోపాటు తొమ్మిది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, రెండు ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్షరీలకు అవసరమైన మందుల సరఫరా కోసం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం గణనీయమైన నిధులను మంజూరు చేసినట్లు వివరించారు.


