న్యూశాయంపేట: కోట్లాది రూపాయల విలువైన వక్ఫ్ భూములు, ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఆస్తులు కాపాడేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ జీఓ జారీ చేసింది. కానీ, జీఓ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో ఇప్పటివరకు కమిటీల ఏర్పాటుకు అడుగు ముందుకు పడలేదు. అధికారుల ఉదాసీనత.. వక్ఫ్ భూములను గుల్ల చేస్తున్న భూబకాసురులకు వరంగా మారింది.
జీఓ ఉంది ... అమలు శూన్యం
జీఓ ప్రకారం కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, మెంబర్లుగా ఎస్పీ/పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్, డీఆర్‌ఓ, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఒక మహిళ, సీనియర్ ముస్లిం అడ్వకేట్లతో కమిటీ నిర్మాణం కావాలి. ప్రతి జిల్లాలో వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ చేయడం, ఆక్రమణలను గుర్తించి నోటీసులు ఇవ్వడం, కోర్టు కేసులను పర్యవేక్షించడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం కమిటీల ప్రధాన విధి. అయితే, జీఓ ఉన్నా జిల్లాల్లో కలెక్టర్లు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన దాఖలాలు లేవు.
నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్..
కమిటీల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది. రూ.కోట్ల విలువైన భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం యథేచ్ఛగా సాగుతోంది. వక్ఫ్‌బోర్డు, జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి మధ్య సరైన సమన్వయం ఉండడం లేదు. కలెక్టర్లు ఇతర పరిపాలన పనుల్లో తీరిక లేకుండా ఉండడంతో ఈ కమిటీల ఏర్పాటును పక్కన పెట్టేసినట్లు సమాచారం. వక్ఫ్‌బోర్డు ఆస్తులను సర్వే చేసేందుకు తగినంత మంది ఇన్‌స్పెక్టర్లు లేకపోవడం కూడా మరోశాపంగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే కమిటీలను నియమించి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మైనారిటీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అన్యాక్రాంతమవుతున్న విలువైన
భూములు
పరిరక్షణ కమిటీల ఏర్పాటులో
ప్రభుత్వం నిర్లక్ష్యం


