హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారిని నీలా, నిత్యాక్రమాల్లో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో నిత్యహ్నికపూజలు జరిగాయి. అనంతరం స్నపనమూర్తిని కాళీకల్పకంలోని నీలాక్రమంలో ఐదుశిరస్సులు, దశభుజాలు, నీలవర్ణ దేహం కలిగి ఎర్రపట్టుచీర, స్వర్ణాభరణ భూషితమైన గాయత్రిమాతగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో నిత్యామాతగా అలంకరించి చతుఃస్థానార్చన పూజలు, నీరాజన మంత్ర పుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఈఓ రాముల సునీత పర్యవేక్షించారు. శుక్రవారం కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మాడవీధులు, రాజగోపురం నిర్మాణం ప్లాన్ శ్రీకుడాశ్రీ అధికారి అజిత్‌రెడ్డితో కలిసి ఈఓ రామల సునీత, అర్చకులు భద్రకాళి పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈ వరుణ్, ఆలయ సిబ్బంది హరానిధ్, కృష్ణ, శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
జనగామ రూరల్: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ నాజర్ శుక్రవారం పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టణంలోని ధర్మకంచ ఏరియా పెద్దమోరి వద్ద ట్రాలీతో ఓ వ్యక్తి, మోటార్ సైకిల్‌తో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ట్రాలీని తనిఖీ చేసి సుమారు 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు మహమ్మద్ అస్సాం జానీ, నాగులు, యాదగిరితోపాటు ట్రాలీ పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
యువకుడి ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్ : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం తండా గ్రామపంచాయతీ పరిధి గడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. రూరల్ హెడ్ కానిస్టేబుల్ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డిగూడెం గ్రామానికి చెందిన మేడి యాదగిరి కుమారుడు గోవిందు (25) సుతారి కూలిపని చేస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం గోవిందు మధ్యాహ్నం వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఐడీఓసీ భవన ప్రారంభంలో నిర్లక్ష్యం : రవికుమార్
వరంగల్ చౌరస్తా: వరంగల్ జిల్లా ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) పనులు దాదాపు పూర్తికావచ్చినా ప్రారంభించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు. సుమారు రూ.80 కోట్ల ప్రజల సొమ్ముతో ఆజంజాహి మిల్లు మైదానంలో ఐడీఓసీ భవనాన్ని నిర్మించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్లే నేటికీ ప్రజలకు అందుబాటులోకి రాలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో మంత్రి కొండా సురేఖ పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు.


