కేయూ క్యాంపస్: మానవాళికి ప్రకృతివైద్యం ఎంతో మేలు చేస్తుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశ్రాంత ఆచార్యులు రామేశ్వరం హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో నిర్వహిస్తున్న ఇంటర్నేషల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్‌సెంటర్ 8వ వార్షికోత్సవం, ఆయన రాసిన ప్రకృతివైద్య గ్రంధాల సూచికల పుస్తకావిష్కరణ కార్యక్రమం కేయూలోని సెనెట్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవాళి మనుగడకు ప్రకృతివైద్యమే బలమైన మూలాధారం అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా రామేశ్వరం మానవ సమాజానికి సమాజ ఉన్నతికి తనవంతు సాయం చేయడం అభినందనీయమన్నారు. ఆహార నియమాలు భారతీయ సంస్కృతిలో ఎప్పటినుంచో ఉన్నాయన్నారు. కానీ వాటిని పాటించకపోవడం వల్లనే ప్రస్తుతం అనేక వ్యాధులకు కారణమన్నారు. కోవిడ్ వ్యాప్తి కాలంలో మానవాళి మనుగడకు ప్రకృతివైద్యం, సహజజీవన విధానాలు ఎంతగానో ఉపకరించాయని గుర్తు చేశారు. తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ.. నేటి ఆధునిక సమాజంలో ప్రకృతి సిద్ధమైన స్వీయ స్వస్థత ప్రక్రియ ద్వారా(నేచురల్ హీలింగ్) ఆరోగ్యాన్ని పునరుద్దరించుకునేందుకు అవసరమైన ఓపిక, నిరీక్షణ, విశ్వాసం నేటితరంలో లేదన్నారు. ప్రకృతిసిద్ధమైన స్వీయ స్వస్థతపై అవగాహన కల్పించాలన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ ఇంచార్జ్ డైరెక్టర్ జీపీ ప్రసాద్ మాట్లాడుతూ.. భారతదేశం యోగా, ప్రకృతి వైద్యంపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తుందని, అమూల్యమైన ఈ భారత వైద్య వారసత్వాన్ని భావితరాలకు అందించాలని అన్నారు. చరిత్రకారులకు కూడా తెలియని ఎన్నో విషయాలు రామేశ్వరం సేకరించారని కొనియాడారు. అనంతరం ఇంటర్నేషనల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్‌సెంటర్ వ్యవస్థాపకుడు ఆచార్య రామేశ్వరం మాట్లాడుతూ.. సమాజానికి తనవంతుగా సేవ చేయాలనే లక్ష్యంతో ఈప్రకృతి వైద్య సాహిత్య విజ్ఞాన సంపదతో లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సభకు కేయూ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్( కుర్తా) అధ్యక్షుడు ఆచార్య సదానందం అధ్యక్షతహించగా కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, ఢిల్లీలోని ఇండియన్ నేచర్‌క్యూర్ ప్రాక్టిషనర్ అసోసియేషన్ అధ్యక్షుడు ధన్‌లాల్‌షిండ్రే, డాక్టర్ అవదేశ్‌మిశ్రా, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రాజ్‌భౌజి, డాక్టర్ గోపి, డాక్టర్ వర్మ, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సంజీవ, డాక్టర్ రాధికారాణి, వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడారు. అనంతరం రామేశ్వరం రాసిన ప్రకృతివైద్య వ్యాససూచికలకు సంబంధించిన 11 పుస్తకాలను ఆవిష్కరించారు.
కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి
ప్రకృతివైద్యగ్రంధం సూచిక పస్తకాల ఆవిష్కరణ


