అట్రాసిటీ కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసు నమోదు

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

ఐనవోలు: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మండలంలోని పెరుమాండ్లగూడెం గ్రామ సర్పంచ్‌ దుప్పెల్లి రాకేష్‌ ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములపై బుధవారం ఐనవోలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై కొంక అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెరుమాండ్ల గూడెం సర్పంచ్‌ రాకేష్‌ వద్దకు అదే గ్రామానికి చెందిన పిడుగు లింగయ్య ఈ నెల 15న ఉదయం వచ్చి తమ్ముడు పిడుగు సంపత్‌తో భూ సమస్య ఉందని తెలిపారు. సంపత్‌ను పిలిపిస్తే పెద్దమనుషుల సమక్షంలో చర్చించుకొని పరిష్కరించుకుంటామని తెలిపాడు. దీంతో సర్పంచ్‌ రాకేష్‌ సిబ్బంది కందిక అనిల్‌ ద్వారా పిడుగు సంపత్‌ కుటుంబానికి సమాచారం అందించారు. కాగా పిడుగు సంపత్‌ అందుబాటులో లేకపోవడంతో వారి కుమారులు పిడుగు శ్రీకాంత్‌, పిడుగు రాకేష్‌లు ఈ నెల 15న ఉదయం గ్రామ పంచాయతీ వద్దకు వచ్చారు. తమను పిలిపించిన వారు ఎవరంటూ కుల ప్రస్తావన తీస్తూ నానా బూతులు మాట్లాడాడు. ఉద్దేశపూర్వకంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను అవమానపరిచారని సర్పంచ్‌ దుప్పెల్లి రాకేష్‌ ఈ నెల 22న ఫిర్యాదుచేయగా పిడుగు శ్రీకాంత్‌, పిడుగు రాకేష్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొంక అశోక్‌ తెలిపారు.

ట్రేడ్‌ లైసెన్స్‌ చెల్లించని

వైన్స్‌కు తాళం

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్‌ లైసెన్స్‌లు చెల్లించని వైన్‌షాపులకు మున్సిపల్‌ కమిషనర్‌ రాధాకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం తాళం వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య వ్యాపార సముదాయాల నిర్వాహకులు ట్రేడ్‌ లైసెన్స్‌ చెల్లించాలని పలుమార్లు చెప్పినా వినడం లేదన్నారు. ప్రధానంగా వైన్స్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది వైన్‌షాపులకు తాళాలు వేయించినట్లు తెలిపారు. దీంతో స్పందించిన నలుగురు వైన్‌షాపుల యజమానులు ట్రేడ్‌ లైసెన్స్‌ చెల్లించారని, మిగిలిన షాపుల నిర్వాహకులు నేడు చెల్లిస్తామని అనుమతి తీసుకున్నారని తెలిపారు. వైన్‌షాపులు మాత్రమే కాదని, అన్ని వాణిజ్య, వ్యాపార సముదాయాల నిర్వాహకులు తప్పనిసరిగా ట్రేడ్‌ లైసెన్స్‌ చెల్లించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్‌ మేనేజర్‌ సత్యనారాయణ, అధికారులు సందీప్‌, శ్రీను, లింగయ్య, సిబ్బంది స్వామి, రాజు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement