హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో సంస్థాగతంగా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నియామక విధానంలో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించే సౌకర్యార్థం జోన్‌ల మార్పుకు పూనుకుంది. ఈ మేరకు రెవెన్యూ జిల్లాల వారీగా సంస్థాగతంగా జోన్‌ల పునర్‌వ్యవస్థీకరిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి అనుగుణంగా నియామక నిబంధనలలోని రెగ్యులేషన్–8ను సవరించనుంది. ప్రస్తుతం సంస్థలో ఉన్న 11 రీజియన్లను జిల్లాస్థాయి స్థానిక కేడర్లుగా, కరీంనగర్, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అనే మూడు జోన్లను జోనల్ కేడర్లుగా పరిగణిస్తున్నారు. ఇకపై 95 శాతం స్థానిక రిజర్వేషన్ సమర్థంగా అమలు చేసేందుకు సమీప జిల్లాలు, సమీప జోన్లను స్థానిక ప్రాంతాలుగా నిర్వచించి, ప్రతి రెవెన్యూ జిల్లా, జోన్ జనాభా నిష్పత్తి ఆధారంగా ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
జోన్ స్థాయి, డిపోల పునర్విభజన
కొత్త సంస్థాగత నిర్మాణంలో భాగంగా వరంగల్, ఖమ్మం రీజియన్‌ను కరీంనగర్ జోన్‌నుంచి హైదరాబాద్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. జోన్‌ల మార్పు మేరకు డిపోల స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వరంగల్ రీజియన్‌లోని భూపాలపల్లి డిపోను కరీంనగర్ రీజియన్‌లోకి మార్చారు. కొత్త జోన్ల నిర్మాణంలో భాగంగా జోన్–1లో వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం రీజియన్‌లు కలిపి మొత్తం 31 డిపోలు ఉంటాయి. జోన్–2లో రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్‌లోని మొత్తం 37 డిపోలు. జోన్–3లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ రీజియన్‌లోని మొత్తం 29 డిపోలు ఉంటాయి. కొత్త సంస్థాగత నిర్మాణం ద్వారా స్థానిక కేడర్ల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్ నియామకాలలో 95 శాతం స్థానిక రిజర్వేషన్ అమలు సులభతరం కానుందని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్‌ల పునర్‌వ్యవస్థీకరణ
కరీంనగర్ నుంచి హైదరాబాద్ జోన్‌లోకి వరంగల్ రీజియన్
వరంగల్‌లోని భూపాలపల్లి డిపో కరీంనగర్ రీజియన్‌కు..


