మహబూబాబాద్ రూరల్: హోలీ పండుగను ఆనందోత్సాహాలతో పాటు సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రజ లను కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ శబరీష్ సోమవారం మాట్లాడుతూ హోలీ పండుగ వేళ సహజసిద్ధమైన, పర్యావరణహిత రంగులను వినియోగించాలని, రసాయనాలతో కూడిన హానికర రంగులను పూర్తిగా నివారించాలని సూచించారు. ఇతరుల అభిమతానికి విరుద్ధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని స్పష్టం చేశారు. పండుగ రోజు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ జిల్లా వ్యాప్తంగా డ్రండెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాల్వల వద్దకు వెళ్లరాదని, తల్లిదండ్రులు చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల మానసిక సమస్యలపై ‘టెలీమానస్’
నెహ్రూసెంటర్: ఇంటర్, టెన్త్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో జిల్లా విద్యార్థుల మానసిక పరిస్థితులు, ఒత్తిడి సమస్యలపై శ్రీటెలీమానస్‌శ్రీ సేవలను అందిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిరాథోడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, విషాదకరంగా ఆత్మహత్య చర్యలకు పూనుకుంటున్నారని, అలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. టెలీమానస్ ఉచిత ఆరోగ్య సేవా అని, 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. నిపుణులైన మానసిక వైద్యులు, క్లినికల్ సైకాలజిస్టులు అందుబాటులో ఉంటారని, ఆపదలో ఉన్న వారికి రక్షణ కవచంగా పని చేస్తుందన్నారు. టెలీమానస్ హెల్ప్‌లైన్ నంబర్ 14416, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు వారి తల్లిదండ్రులు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మానసిక వైద్యులను సంప్రదించి సేవలను పొందవచ్చన్నారు. పరీక్షల్లో ఫెయిల్ కావడం తప్పు కాదని, ఆత్మహత్యలకు సంబంధించిన ఆలోచనలు చేయడం తప్పని, విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.
ఆలిండియా టోర్నమెంట్‌కు
కేయూ జట్టు
కేయూ క్యాంపస్: హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఆలిండియా ఇంటర్ వర్సిటీ బాక్సింగ్ టోర్నమెంట్‌కు కేయూ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు సోమవారం వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. ఈజట్టులో బి.నిఖిల్‌గౌడ్, కె.శ్రీశాంత్‌గౌడ్, ఎం సంజయ్, పినవదీప్, వి.వంశీకృష్ణ, విన్‌పాల్, జి.అభిషేక్, జి.చంద్రశేఖర్ ఉన్నట్లు వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు హనుమకొండ ప్రభుత్వ బీఈడీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎన్.రమేశ్ కోచ్‌కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు.
రామప్పలో ఫారెస్ట్ అధికారులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సోమవారం అటవీశాఖ ఎంఓఈఎఫ్‌సీసీ ఐజీఎఫ్ డాక్టర్ త్రినాధ్ కుమార్, సీపీఎఫ్ ప్రభాకర్ సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్‌లు వారికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించగా రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వారికి వివరించారు.


