కురవి: పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, ప్రణాళిక ప్రకారం చదివి లక్ష్యాన్ని సాధించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.రాజుకృష్ణ సూచించారు. సోమవారం మండలంలోని నేరడ జెడ్పీ హైస్కూల్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్యసదస్సు నిర్వహించారు. బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్యవివాహాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. న్యాయపరమైన సలహాలు, సూచనల కోసం నల్సా టోల్‌ఫ్రీ నంబర్ 15100, బాల్య వివాహాల నివారణ, బాలకార్మిక నిర్మూలన కోసం ఫిర్యాదులు, సహాయం కోసం 1098 నంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బాలాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


