విద్యుత్‌ వ్యవస్థ రక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వ్యవస్థ రక్షణకు చర్యలు

Mar 3 2026 8:23 AM | Updated on Mar 3 2026 8:23 AM

హన్మకొండ/నెహ్రూసెంటర్‌: విద్యుత్‌ వ్యవస్థను రక్షించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్‌ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వర్షాకాలం, అకాల వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. వీటితో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లకు, విద్యుత్‌ లైన్లకు ముప్పు వాటిల్లుతోంది. తద్వారా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్‌ వ్యవస్థలను రక్షించడంతోపాటు వినియోగదారులకు అంతరాయాలు లేకుండా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్‌ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి సబ్‌స్టేషన్‌లో నిర్మాణ సమయంలోనే లైట్నింగ్‌ అరెస్టర్‌లు (పిడుగుల నిరోధకాలు) ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పొడవాటి లైన్లను గుర్తించి ఈ లైన్లలో స్తంభాలకు లైట్నింగ్‌ అరెస్టర్‌లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లకు, విద్యుత్‌ లైన్లకు రక్షణ ఉంటుంది.

టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో పొడవాటి విద్యుత్‌ లైన్లలో మొత్తం 2,337 లైటర్నింగ్‌ అరెస్టర్‌లు ఏర్పాటు చేశారు. హనుమకొండ సర్కిల్‌లో 95, వరంగల్‌ సర్కిల్‌లో 25, జనగామలో 107, భూపాలపల్లి సర్కిల్‌లో 52, మహబూబాబాద్‌ సర్కిల్‌లో 38, ఖమ్మం సర్కిల్‌లో 248, భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్‌లో 182, కరీంనగర్‌ సర్కిల్‌లో 281, జగిత్యాలలో 161, పెద్దపల్లిలో 211, నిజామాబాద్‌లో 328, కామారెడ్డిలో 59, అదిలాబాద్‌లో 89, నిర్మల్‌లో 84, మంచిర్యాలలో 218, ఆసిఫాబాద్‌ సర్కిల్‌లో 159 లైటర్నింగ్‌ అరెస్టర్‌లు ఏర్పాటు చేశారు.

ఎలా పనిచేస్తుందంటే..

లైట్నింగ్‌ అరెస్టర్‌ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక ఓల్టేజీని భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం. దీని ద్వారా ట్రాన్స్‌ఫార్మర్‌లు, సబ్‌స్టేషన్‌లు, స్విచ్‌గేర్‌ పరికరాలు, ఇతర విద్యుత్‌ పరికరాలతో పాటు యంత్రాంగం సురక్షితంగా ఉండడం ద్వారా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయి. మెరుపు కారణంగా కలిగే బ్రేక్‌డౌన్లు తగ్గుతాయి. దీంతోపాటు పరికరాలు సురక్షితంగా ఉండడంతో నష్టం తగ్గుతుంది.

ఉరుములు, మెరుపులనుంచి

రక్షణకు నిరోధకాల బిగింపు

టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 2,337 లైట్నింగ్‌ అరెస్టర్ల ఏర్పాటు

ముందస్తు చర్యలు: టీజీఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి

అకాల వర్షాలు, పిడుగులతో విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు విద్యుత్‌శాఖ మహబూబాబాద్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ పి.విజేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను రక్షించేందుకు కీలక ప్రాంతాల్లో 51 లైట్నింగ్‌ అరెస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. లైట్నింగ్‌ అరెస్టర్‌ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక వోల్టేజ్‌ భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరమన్నారు. మెరుపు కారణంగా కలిగే బ్రేక్‌ డౌన్లు తగ్గే అవకాశం ఉందన్నారు. అకాల వర్షాలు, మెరుపుల సమయంలో విద్యుత్‌ పరికరాలను తాకకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యంగా విద్యుత్‌ శాఖ పనిచేస్తుందని ఎస్‌ఈ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement