దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

Mar 3 2026 8:23 AM | Updated on Mar 3 2026 8:23 AM

న్యాయం చేయండి మేడం...

‘నా బిడ్డ ఫుడ్‌ పాయిజన్‌తో చనిపోయింది. కానీ అధికారులు విచారణ జరపడం లేదు.. నివేదిక ఇవ్వడం లేదు. గత కలెక్టర్‌కు చెప్పినా వినిపించుకోలేదు.. మీరైనా పట్టించుకుని న్యాయం చేయండి’ అంటూ మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్యా నీల ఇటీవల బాధ్యతలు తీసుకున్న కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ కాళ్లపై పడి వేడుకుంది. తన కూతురు నిత్యశ్రీ (4) గత ఏడాది డిసెంబర్‌ 18న అంగన్‌వాడీలో ఫుడ్‌పాయిజన్‌ అయి చనిపోయిందని, అధికారులు ఇప్పటి వరకు విచారణ చేయలేదని, తమకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై స్పందించిన కలెక్టర్‌.. ఈ ఫైల్‌కు సంబంధించిన వివరాలు, విచా రణ వివరాలు తెలపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

–సాక్షి ఫొటోగ్రాఫర్‌, మహబూబాబాద్‌

మహబూబాబాద్‌: ప్రజావాణి దరఖాస్తులను పరి శీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్‌ స్నేహశబరీష్‌, అదనపు కలెక్టర్లు లెనిన్‌ వత్సల్‌ టొప్పో, కె.అనిల్‌కుమార్‌, ఆర్డీఓ కృష్ణవేణి వినతులను స్వీకరించారు. క లెక్టర్‌ ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే పరిష్కరించే విధంగా చర్య తీసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులతో పెండింగ్‌ దరఖాస్తులపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలు, మండల ప్రత్యేక అధికారులు ప్రతీ 15 రోజులకు ఒకసారి కేటాయించిన హాస్టళ్లను తనిఖీ చేయాలన్నారు. పదో తరగతి పరీక్షల నేపద్యంలో టైంటేబుల్‌ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించి జిల్లాలో అత్యుత్తమ ఫలితాలను సాధించాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 107 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు.

దరఖాస్తులు ఇలా..

● బుద్దారం గ్రామంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పేరుతో సుమారు 50 ఇళ్లు కూల్చేవిధంగా మార్కింగ్‌ చేస్తున్నారని, దానికి బదులు మరోమార్గం పరిశీలించాలని బుద్దారం గ్రామస్తులు శ్రీనివాస్‌, పద్మ, అలివేలు, కళావతి, లక్ష్మి తదితరులు కలెక్టర్‌కు విన్నవించారు.

● బయ్యారం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బయ్యారం నియోజకవర్గ సాధన కమిటీ జేఏసీ చైర్మన్‌ చందర్‌నాయక్‌, నాయకులు ప్రకాష్‌, గుట్టయ్య తదితరులు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.

● నాంచారి మడూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు బండారి గణేష్‌ తనకున్న గుంట భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని, విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని కోరారు.

● తట్టుపల్లి గ్రామ కార్యదర్శి నా సంతకాలు ఫోర్జరీ చేసి బిల్లులు కాజేసిందని మాజీ సర్పంచ్‌ కె.రాంరెడ్డి విన్నవించారు.

గ్రీవెన్స్‌పై కలెక్టర్‌ ఫోకస్‌

ఎవరి పని వారు చేసుకుంటూ పోవాలని ఆదేశం

వచ్చే వారంలోపు వినతులపై స్పష్టత ఇవ్వాలి

అనవసరంగా ప్రజలను

తిప్పుకోవద్దని హితవు

సాక్షి, మహబూబాబాద్‌: నూతనంగా జిల్లాకు వచ్చిన కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ విధుల్లోకి చేరిన తర్వాత సోమవారం మొదటి గ్రీవెన్స్‌పై ఫోకస్‌ పెట్టారు. గతంలో గ్రీవెన్స్‌కు వస్తే సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఉండేది. జిల్లాకు కొత్త కలెక్టర్‌ రావడంతో ఆమె ఆధ్వర్యంలోనైనా సమస్కకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో సోమవారం ఫిర్యాదుదారులు తరలివచ్చారు. ఇంతకు ముందు నిర్వహించిన గ్రీవెన్స్‌కు మొత్తం 72 దరఖాస్తులు రాగా.. సోమవారం 107 మంది వచ్చి తమ సమస్యను చెప్పుకున్నారు. గ్రీవెన్స్‌కు వచ్చిన వారిలో కొందరు గతంలో తమ సమస్యలపై వినతిపత్రం అందజేశామని..ఇప్పటి వరకు న్యాయం జరగలేదని చెప్పడంతో అసలు ఏం జరుగుతుందనే విషయంపై కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఆరా తీశారు. ప్రజావాణి వ్యవహారం ఎవరు చూస్తున్నారు.. గతంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారా.. ఎన్నింటిని పరిష్కరించారు? అనే విషయాలు అడిగారు. ఎవరి సెక్షన్‌ వారు చూసుకోవాలి.. ఒకరి పనుల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దని అధికారులకు చెప్పారు. వచ్చే వారం వరకు ప్రతీ దరఖాస్తు మీద స్పష్టత ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా తల్లిదండ్రుల పోషణ పట్టించుకోవడం లేదని వృద్ధుడు చేసిన విన్నపంపై ఆర్డీఓ విచారణ ఏమైందని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రీవెన్స్‌ పూర్తయిన తర్వాత కూడా జిల్లాలోని పదో తరగతి ప్రిపరేషన్‌, పరీక్ష కేంద్రాల గుర్తింపు, ఇందిరమ్మ పథకం అమలు తీరుపై అధికారులతో కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ సమీక్షించారు.

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

ప్రజావాణిలో 107 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement