ప్రాక్టికల్స్‌కు వేళాయె
నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
● హాజరుకానున్న 4,078 మంది
విద్యార్థులు
● సీసీ కెమెరాల మధ్య ఎగ్జామ్స్
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 2నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులకు పరీక్షలు కొనసాగనున్నాయి. థియరీ మార్కులతో పాటు ప్రాక్టికల్స్ మార్కులు కూడా కీలకంగా మారనున్నాయి. దీంతో రాష్ట్ర సర్కార్ ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.50 వేల చొప్పున ప్రాక్టికల్ పరీక్షల పరికరాలు, ఇతర సామగ్రికోసం కేటాయించింది. కాగా ఈఏడాది నుంచి వివిధ సంక్షేమ గురుకుల కళాశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయం జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షల సెంటర్ నిర్వహించనున్నారు.
4,078 మంది విద్యార్థులు..
జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 4,078 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 2120 మంది, ఒకేషనల్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో 1958 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షకు హజరవుతారు. మొత్తం 21 జనరల్ పరీక్ష కేంద్రాలు, 13 ఒకేషనల్ పరీక్ష కేంద్రాలు ఉంటాయి. మొదటి సెక్షన్ పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయత్రం 5గంటల వరకు రెండో సెక్షన్ పరీక్షలు జరుగుతాయి. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను రాష్ట్ర, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల మధ్య పరీక్షలు జరగాలని, లేని పక్ష్యంలో ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు.
ప్రైవేట్ కళాశాలల్లో తూతూ మంత్రంగా..
జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలకు కావాల్సిన రసాయన పదార్థాలు ఉండడం లేదు. కాగా ఆమ్లాల సీసాల బిరడాలను ఒకసారి తీసేస్తే మరోసారి ప్రయోగానికి పనికి రావు. ఇవన్నీ అవిరయ్యే గుణాలు కలిగి ఉంటాయి. అయితే ఆ పాత వాటితోనే ప్రాక్టికల్ పరీక్షలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. అధికారులు ప్రైవేట్ కళాశాలలపై శ్రద్ధ వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్‌లో సూచించిన సమయానికి కంటే 30నిమిషాల ముందు కేంద్రాలకు చేరుకోవాలి. గైర్హాజరైతే పరీక్షల్లో ఫెయిల్ అయినట్లే. ఈ విషయాన్ని విద్యార్థులకు కళాశాలల అధ్యాపకులు ఒకటికి రెండు సార్లు చెప్పాలి. నిమిషం అలస్యంగా వస్తే విద్యార్థులకు అనుమతి లేదు. సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలి.
–సీహెచ్. మదార్‌గౌడ్, డీఐఈఓ
ప్రాక్టికల్స్‌కు వేళాయె


