ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి
మరిపెడ: ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని బీసీ సంక్షేమశాఖ, రవాణాశాఖ మంత్రి, మానుకోట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలకు తావు ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి ఓట్లు పోలయ్యేవిధంగా చూడాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్‌ఎస్ దుకాణం కొద్ది రోజుల్లో బంద్ కానున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ, జిల్లా నాయకులు యుగేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రఘువీరరెడ్డి, పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్ పాల్గొన్నారు.
సానుభూతి కోసం బీఆర్‌ఎస్ ఆరాటం..
మహబూబాబాద్ రూరల్ : కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రతిపక్ష నేతలు మాట్లాడుకున్నది ఫోన్ ట్యాపింగ్ చేసి.. విచారణకు, అధికారులకు సహకరించకుండా రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసును సాకుగా చూపుతూ, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలని మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజల్లో సానుభూతి కోసం బీఆర్‌ఎస్ పార్టీ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కోరం కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం, మానుకోట డీసీసీ అధ్యక్షురాళ్లు దేవీప్రసన్న, భూక్య ఉమ తదితరులు ఉన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్


