
గిరిజనేతరుల ఆశలు!
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ
సాక్షి, మహబూబాబాద్: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మాట వినపడితే చాలు జిల్లాలో ఏ నలుగురు ఒకచోట చేరినా ఇదే చర్చ జరుగుతోంది. గత నాలుగు పర్యాయాలు ఎస్టీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలు ప్రస్తుతం జనరల్‌గా మారే అవకాశం ఉందా అని గిరిజనేతరులు లెక్కలు వేస్తున్నారు. అయితే ఆది వాసీలు, లంబాడ గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జనరల్‌గా మారడం అంత సులువు కాదని గిరిజన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు పర్యాయాలుగా..
మహబూబాబాద్ జిల్లా కేంద్రం 2009కి ముందు జనరల్ కేటగిరిలో ఉండేది. వరుసగా 2009, 2014, 2018, 2024లో ఎస్టీ రిజర్వేషన్‌తో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు తర్వాత జరిగిన భౌగోళిక మార్పులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కలిసిన గార్ల, బయ్యారం మండలాల్లో కూడా అత్యధికంగా గిరిజనులే ఉన్నారు. దీంతో జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్‌తోపాటు ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల్లో కూడా ఎస్టీ రిజర్వేషన్ కొనసాగుతూ వస్తోంది
ఏ ప్రాతిపదిక పునర్విభజన..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో ఒక్కో నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లింది. దీంతో ఎమ్మెల్యే మూడు జిల్లాల జెడ్పీ, ఇతర రివ్యూ మీటింగ్‌లకు హాజరు కావాల్సి వస్తోంది. అదే విధంగా ప్రభుత్వ పథకాల అమలులో కూడా మండలం ఒక జిల్లా, నిధుల కేటాయింపు మరో జిల్లాలో జరుగుతోంది. దీంతో ఎవరు ఎక్కడ దృష్టి సారించలేక అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బాగుంటుందనే ఆలోచన ఉంది. అయితే పునర్విభజన అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకోకపోవచ్చనే చర్చ జరుగుతోంది. అలా కాకుంటే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పునర్విభజన జరగాలి. అప్పుడు మళ్లీ బయ్యారం, గార్ల మండలాలు ఖమ్మం జిల్లా పరిధిలోకి వెళ్తాయి. అప్పుడు మళ్లీ ఇబ్బందులు తలెత్తుతాయి. కాగా ఏ ప్రాతిపదికన విభజన జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు.
ఆ రెండు పట్టణాలపైనే గిరిజనేతరుల ఆశలు
జనరల్ స్థానం వస్తే గిరిజనేతరులు క్రియాశీలకం
అంత సులువుగా రిజర్వేషన్ మారదని గిరిజన నాయకుల ధీమా
రోజురోజుకూ పెరుగుతున్న ఉత్కంఠ