
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మరిపెడ రూరల్: వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిల్ వత్సల్ టొప్పో అన్నారు. గత ఏడాది ముంపునకు గురైన మండలంలోని పురుషోత్తమాయగూడెం పరిధి ఆకేరు వాగు బ్రిడ్జిని బుధవారం పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని, రాత్రి వర్షం పడితే సహాయక చర్యలు చేపట్టేందుకు రిలీప్ క్యాంపులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి, రాజేశ్వర్‌రావు, ఆర్‌ఎస్ శరత్‌చంద్ర, మున్సిపల్ కమిషనల్ విజయానంద్, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్: అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కూడా అలర్ట్ చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు, బంధం చెరువును బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజేశ్వర్, అధికారులు ఉన్నారు.
వ్యాధులపై జాగ్రత్తలు అవసరం
మరిపెడ: విద్యార్థులు వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మరిపెడలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రుచికరమైన వేడివేడి ఆహారం వడ్డించాలన్నారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల పెద్దచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటల వద్ద అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. తహసీల్దార్లు కృష్ణవేణి, రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ విజయానంద్, ఎంపీడీఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.