
వేగంగా ‘భువన్’ సర్వే
సీడీఎంఏ ఆదేశాలతో..
సీడీఎంఏ ద్వారా వచ్చిన ఇళ్ల జాబితా ఆధారంగా భువన్ సర్వే చేస్తున్నట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. ఆన్‌లైన్ వివరాలకు.. యాప్‌లో నమోదైన వివరాల్లో తేడా ఉంటే దాని ప్రకారం పన్ను విధిస్తున్నారు. అలాగే ట్రేడ్ లైసెన్స్‌లపై కూడా ఆయాప్ ద్వారా సర్వే చేస్తున్నారు. గతంలో ట్రేడ్ లైసెన్స్‌లు కమర్షియల్‌లో ఉన్నాయా.. రెసిడెన్షియల్‌లో ఉన్నాయా అని చూడకుండా లైసెన్స్‌లు జారీ చేశారు. కాగా, సర్వే ద్వారా వాటి లెక్క కూడా తేలుతోంది. దీంతో కమర్షియల్ భవనమైతే లైసెన్స్ పన్ను పెంచుతున్నారు. ఒక్క మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 1150 ట్రేడ్ లైసెన్స్‌లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మహబూబాబాద్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వందరోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా భువన్ సర్వే చేపడుతున్నారు. యాప్‌లో ఇళ్ల వివరాలను నమోదు చేస్తున్నారు. అలాగే ట్రేడ్ లైసెన్స్‌లు కమర్షియల్‌లో ఉన్నాయా, రెసిడెన్షియల్‌లో ఉన్నాయా అనే అంశాలను కూడా సర్వేలో నమోదు చేస్తున్నారు. ఇళ్ల కొలతల్లో తేడాలు ఉంటే పన్ను పెంచి ఆన్‌లైన్ చేస్తున్నారు. కాగా, ఈ సర్వే ద్వారా మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అంటున్నారు.
ఐదు మున్సిపాలిటీలు..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా 57,828మంది ఓటర్లు, 68,889 మంది జనాభా, 25,000 పైచిలుకు గృహాలు ఉన్నాయి. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో 19,100 జనాభా ఉంది. మరిపెడలో 15 వార్డులు, 17,875 మంది జనాభా, డోర్నకల్‌లో 15 వార్డులు, 14,425 మంది జనాభా ఉంది. ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. ఈ ఏడాది జూన్ 2నుంచి వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే భువన్ సర్వే నిర్వహిస్తున్నారు.
కొనసాగుతున్న సర్వే..
ఐదు మున్సిపాలిటీల్లో భువన్ సర్వే జరుగుతోంది. ప్రతీవార్డులో వార్డు ఆఫీసర్‌తో పాటు బిల్ కలెక్టర్ మరో ఇద్దరి సిబ్బందితో భువన్ సర్వే చేస్తున్నారు. ప్రతీ ఇంటిని ఆ యాప్‌లో నమోదు చేయడమే సర్వే లక్ష్యం. కాగా, గూగుల్ ద్వారా లొకేషన్‌లో అన్ని వివరాలు తెలుసుకునే అవకాఽశం యాప్ ద్వారా కలుగుతుంది. మానుకోట మున్సిపాలిటీలో 25,262 గృహాలు ఉండగా.. దాదాపు 23,000 గృహాలు నమోదు అయ్యాయి. 2,262 ఇళ్లు భువన్ యాప్‌లో నమోదు కాలేదు. అయితే ఆన్‌లైన్‌లో నమోదై పన్ను చెల్లిస్తున్నప్పటికీ భువన్ యాప్‌లో నమోదు కాలేదు. కాగా 2,262 ఇళ్లకు గానూ 1400ఇళ్లకు వెళ్లి కొలతలు వేసి యాప్‌లో నమోదుచేశారు. కొలతలు వేసి అదనంగా నిర్మాణాలు ఉంటే వాటిని నమోదు చేస్తున్నారు. తద్వారా ఆ ఇళ్లకు చెల్లించే పన్ను పెరిగి మున్సిపాలిటీలకు మరింత ఆదాయం సమకూరుతుంది.
ఈనెలలో సర్వే పూర్తి
రెండు నెలలుగా భువన్ సర్వే జరుగుతోంది. దీంతో ఇళ్ల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. సర్వే ద్వారా అదనపు నిర్మాణాలు బయట పడుతున్నాయి. దాని ప్రకారం ఇంటి పన్ను వేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్‌ల వివరాలు కూడా పక్కాగా తెలిసి ఆదాయం పెరుగుతోంది.
– టి.రాజేశ్వర్, మానుకోట మున్సిపల్ కమిషనర్
ఇళ్ల కొలతలు, ట్రేడ్ లైసెన్స్‌ల వివరాలు యాప్‌లో నమోదు
వందరోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మున్సిపాలిటీల్లో సర్వే
కొలతల్లో తేడాలు ఉంటే పన్ను పెంపు