
మూగబోయిన మహిళా చైతన్య దీప్తి..
నేడు కేఎంసీకి రజిత పార్థివదేహం అప్పగింత
రచయిత్రీ అనిశెట్టి రజిత పార్థివదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. రజిత వివాహం చేసుకోలేదు. ఆమెకు సొంతిల్లు లేదు. ఈ నేపథ్యంలో కేయూ ఫస్ట్ గేటు దగ్గర గల కేయూ విశ్రాంతాచార్యులు కాత్యాయనీవిద్మహే గృహంలో రజిత పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఐ’ బ్యాంక్ టెక్నీషియన్లు రాత్రి ఆమె కళ్లను సేకరించి భద్రపరిచారు.
హన్మకొండ కల్చరల్ : మహిళా చైతన్య దీప్తి మూగబోయింది. హనుమకొండకు చెందిన ప్రముఖ రచయిత్రీ అనిశెట్టి రజిత సోమవారం రాత్రి కన్నుమూశారు. అనిశెట్టి రజిత మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచారు. అనేక కథలు, విమర్శనవ్యాసాలు, సమీక్షలు, ఉద్యమ డాక్యుమెంట్లు రాశారు. కుటిలరాజకీయాలకు లేని బలం కలానికి, నిజానికి ఉందని నమ్మి కవిత్వమే శ్వాసగా జీవించారు. 52 సంవత్సరాలుగా కవితావ్యాసంగం కొనసాగిస్తూ, వివిధ ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పొషిస్తూ కూడా నిరాడంబరంగానే కనిపించేవారు. నాలుగు దశాబ్దాల కాలంలో జీవనదిలా అన్ని ఉద్యమాలకు ఊటనీరందిస్తూ చైతన్యాన్ని సజీవంగా ఉంచారు. ఆమె కవితలో శిల్పంపై వ్యామోహం తక్కువ, వస్తువుపై ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది.
ప్రస్థానం..
అనిశెట్టి రజితది హనుమకొండలోని కుమార్‌పల్లి. బాలరాజు, జయలక్ష్మి దంపతులకు 1958 ఏప్రిల్ 14న జన్మించారు. కాజిపేట ఫాతిమా బాలికల పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ(తెలుగు), ఎంఫిల్ పూర్తి చేశారు. అలాగే, ఇదే విశ్వవిద్యాలయంలో ఎంఏ(ప్రభుత్వ పాలనా శాస్త్రం) చదివి యునివర్సిటీ ఫస్ట్ ర్యాంకు సాధించారు. కేయూలోనే ఎంఫిల్ పూర్తిచేసి కొంతకాలం ఉమెన్స్ స్టడీ సెంటర్, ఎస్సీ, ఎస్టీ సెల్‌లో పరిశోధకురాలిగా పనిచేస్తూ అనేక జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేశారు. 1969–71 మధ్య తెలంగాణ ఉద్యమం ముగింపు దశలో చురుగ్గా పాల్గొన్నారు. 1975లో పైసా కవితతో స్టేజీపై కవితలు చదవడం ఆరంభించారు. అప్పటి నుంచి నిరంతరం కృషి చేస్తూ దళిత, బహుజన, స్రీ వాద, పౌర, మానవ హక్కుల, సాహిత్య, సామాజిక ఉద్యమాలన్నీటిలోనూ మమేకమై అనేక స్థానిక, జాతీయ వేదికలు, సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేశారు.
ప్రచురణలు..
గులాబీలు జ్వలిస్తున్నాయి(1984), నేనొక నల్లమబ్బునవుతా(1997), చెమటచెట్టు(1999), ఓ లచ్చవ్వ (దీర్ఘకవిత 2000–2005), ఉసురు(కవితా సంపుటాలు 2002), గోరంతదీపాలు (నానీలు 2005), దస్తఖత్ (హైకులు 2005), అనగనగా కాలం (2005), మట్టిబంధం (కథలు 2006), నన్హే ఓ నన్హే (నానీలు 2007), మార్కెట్ స్మార్ట్ శ్రీమతి. (దీర్ఘ కవిత 2010)
సంపాదకీయాలు..
వెతలే కథలై(రచయిత్రుల కథాసంకలనం 2011), ఊపిరి (తెలంగాణలో ఆత్మహత్యలపై నిరసన కవిత 2012), జిగర్ (తెలంగాణ విశిష్ట కవితా సంకలనం 2013), ఉద్విగ్న( లైంగిక భారతంపై ఓరుగల్లు క వుల నిరసన 2013), ఆకాశపుష్పం (అపూర్వ త్యా గానికి నీరాజనం 2014), ముజఫర్‌నగర్ మారణ కాండ(నిషిద్ధమేఘాల్లోకి మాయాత్ర 2014),2 0 14లో పోలవరం ప్రాణాంతక ప్రయోగం వెలువరించగా 2016లో అక్షరశరధి దాశరథి, నిర్భయాకా శం పుస్తకాలు ప్రచురించారు. 2017 ఆమె సంపాదకత్వ ంలో భిన్న అస్తిత్వాల సీ్త్రల సాహిత్యం– పరిచయ వ్యాసాలు తీరొక్క పూల పుస్తకం వెలువరించారు.
అవార్డులు..
2017లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారం, అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం, ల యన్స్ ఇంటర్నేషనల్ పురస్కారం, కృష్ణవేణి కళాసమితి ఉగాది పురస్కారం తదితర అనేక అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు.
ఎంపీ సంతాపం..
రజిత హఠాన్మరణం పట్ల వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సాహితీలోకానికి, వరంగల్ సాహితీ రంగానికి రజిత మృతి తీరని లోటని పేర్కొన్నారు.
ప్రముఖ రచయిత్రీ అనిశెట్టి రజిత హఠాన్మరణం