కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ మూడేళ్లుగా ఇష్టారాజ్యంగా పా లన కొనసాగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఆయన బాధ్యతలు స్వీకరించి ఈనెల 21వ తేదీతో మూడేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో పెద్ద షాక్ తగిలింది. వీసీపై వచ్చిన ఆరోపణలను నిగ్గుతేల్చాలని విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివాదాస్పద నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారంటూ ఉద్యోగులు, అధ్యాపకులు, వి ద్యార్థుల్లో అసంతృప్తి నెలకొంది. రోజూ ఆందోళన జరగడం సాధారణమైంది. పాలనను పట్టించుకోకుండా ఆయన వ్యవహార శైలి, యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు వచ్చాయి. వీటన్నింటినీ కాకతీయ యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ (అకుట్) బాధ్యులు కూడా పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. గత జనవరి 14న, 24న సీఎం రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంలకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ విచారణకు శనివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీసీ రమేశ్ గత మూడేళ్లలో అనేక అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారని, నా లుగు అంశాలను పేర్కొంటూ, వాటిపై విచారణ జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. టర్మినేట్ అయిన పలువురు ఫ్యాకల్టీలను చట్టవిరుద్ధంగా కొనసాగిస్తున్నారని, అక్రమ బదిలీలు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అకడమిక్ నియామకాలు చేపట్టారని, ఫేక్ ప్రాజెక్టులకు కూడా అనుమతి, రూపకల్పన చేశారని ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, అకుట్ వివిధ అంశాలతో కూడిన 150 పేజీల ఫిర్యాదు అందించింది.
‘అకుట్’ ఫిర్యాదుతో ఆదేశాలు జారీ
యూనివర్సిటీలో
అక్రమ నియామకాలు
గిట్టని వారిపై
కక్షసాధింపు చర్యలు
యూనివర్సిటీకి రాకుండా
లాడ్జి నుంచే పాలనపై విమర్శలు
వివిధ విభాగాల్లో అవకతవకలపై
వెల్లువెత్తిన ఆరోపణలు
వీసీ వ్యవహార శైలిపై
‘సాక్షి’లో పలు కథనాలు