మీ చేతుల్లోనే తీర్పు | - | Sakshi
Sakshi News home page

మీ చేతుల్లోనే తీర్పు

Nov 25 2023 1:24 AM | Updated on Nov 25 2023 1:24 AM

- - Sakshi

వాతావరణం

జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రాత్రిపూట చలి తీవ్రత ఉంటుంది.

గంజాయి స్వాధీనం

రైలులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని 23.860 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు.

8లోu

తొర్రూరులో జరిగిన కాంగ్రెస్‌ పాలకుర్తి నియోజకవర్గ విజయభేరి సభకు హాజరైన జనం

సాక్షి, మహబూబాబాద్‌/ తొర్రూరు: ‘మీ చేతుల్లోనే తీర్పు ఉంది. మీరే న్యాయ నిర్ణేతలు. అమెరికాలో ఉంటూ ఇక్కడి ప్రజలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి యశస్వినిరెడ్డి కుటుంబానికి చేయూతనిచ్చి, చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలి’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కోరారు. కాంగెరస్‌ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి యశస్వినిరెడ్డి గెలుపుకోసం శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో ఏర్పాటు చేసిన విజయభేరి బహిరంగ సభకు ఆమె హాజరై ప్రసంగించారు. త్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఫాంహౌస్‌లో ఉండి పాలించే నాయకుల సొత్తుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలిస్తే దొరల తెలంగాణగానే ఉంటుందని, కాంగ్రెస్‌తోనే ప్రజల తెలంగాణ సాధ్యమని అన్నారు.

నోటిఫికేషన్లు వేయడం.. లీకేజీలతో సంపాదన

ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. నోటిఫికేషన్లు వేయడం, పేపర్ల లీకేజీతో డబ్బులు సంపాదించాలనే నీచపు కేసీఆర్‌ పాలనకు చరమ గీతం పాడాలని ప్రియాంకగాంధీ పిలుపునిచ్చారు. ఒక వైపు తెలంగాణ ఉద్యమం, త్యాగాలను గుర్తుచేస్తూ మరోవైపు గడిచిన పదేళ్లలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ద్రోహం వివరిస్తూ ఆమె చేసిన ఉపన్యాసం సభికులను ఉత్తేజపరిచింది. యువతను ప్రభుత్వం ఎలా మోసం చేసిందో ఆమె వివరిస్తుండగా.. యువత జేజేలు పలికారు. అదేవిధంగా తాను మహిళను అని, వారు పడే కష్టాలు తనకు తెలుసని, అందుకు మహాలక్ష్మి, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. మా నాయనమ్మ ఇందిరమ్మ పాలన తీసుకొస్తామని అనగా.. మహిళలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. రైతుల గురించి మేనిఫెస్టోలో పేర్కొన్న రూ.2లక్షల రుణమాఫీ, రైతుసాయం, గిట్టుబాటుధరతో పాటు ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పగానే సభలో ఉన్న రైతులంతా ఈలలు, చప్పట్లతో ప్రతిస్పందించారు. అదేవిధంగా సభలో తీన్మార్‌ మల్లన్న పిట్టకథలు చెబుతూ.. మాట్లాడిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. నేను మీ సేవ కోసమే వచ్చాను. నా కోడలును అభ్యర్థిగా నిలిపాను ఆశీర్వదించండి అనగానే.. ఒక్కసారిగా సభలో కూర్చున్నవారంతా లేచి జై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. రాజేందర్‌రెడ్డి కూడా వేదికపై కూర్చొని ప్రజల స్పందనను చూసి చేతులు ఎత్తి నినదించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కర్ణాటక ఆరోగ్యశాఖమంత్రి దినేశ్‌ గుండురావు, తీన్మార్‌ మల్లన్న, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, నాయకులు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మీనారాయణనాయక్‌, ఎర్రబెల్లి స్వర్ణ, దొమ్మాటి సాంబయ్య, కాకిరాల హరిప్రసాద్‌, ప్రవీణ్‌రావు, హామ్యానాయక్‌, పెదగాని సోమయ్య, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

వారసత్వాన్ని అడ్డుకోలేరు: యశస్వినిరెడ్డి

‘పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు సేవ చేయడానికి వస్తే మంత్రి దయాకర్‌రావు కుట్రలు పన్ని మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి పౌరసత్వాన్ని రద్దు చేయించారు.. కానీ ఆమె వారసత్వాన్ని అడ్డుకోలేరు’ అని కాంగ్రెస్‌ పాలకుర్తి అభ్యర్థి యశస్వినిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాదరణకు భయపడిన మంత్రి దయాకర్‌రావు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, ఇకమీదట కేసులు పెడితే సహించేది లేదన్నారు. ‘మీ బిడ్డగా, అక్కగా, చెల్లిగా నన్ను ఆదరించి అసెంబ్లీకి పంపిస్తే మా అత్తామామల పేరు నిలబెడతాను. మీకు మరింత సేవ చేస్తా’ను అని చెప్పారు. ఎవరు ఎన్ని డబ్బులిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం చేతి గుర్తుకే వేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు.

తరలివచ్చిన జనం.. మురిసిన తొర్రూరు

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయభేరి సభ విజయవంతం కావడంతో క్యాడర్‌లో జోష్‌ నెలకొంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తొర్రూరు జనసంద్రమైంది.

సేవచేసే కుటుంబానికి చేయూతనివ్వండి

బీఆర్‌ఎస్‌తో దొరలపాలన,

కాంగ్రెస్‌తో ప్రజల పాలన

లీకేజీల కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలి

మళ్లీ మా నాయనమ్మ ఇందిరమ్మ రాజ్యం తెద్దాం

పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు

ప్రియాంకగాంధీ పిలుపు

సైడ్‌లైట్స్‌..

మధ్యాహ్నం 2.55 గంటలకు హెలికాప్టర్‌లో ప్రియాంకగాంధీ తొర్రూరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

3.02 గంటలకు సభా వేదికపైకి వచ్చారు.

3.09 గంటలకు ప్రసంగం మొదలవగా 3.51 గంటల వరకు మాట్లాడారు.

41 నిమిషాల పాటు ప్రసంగం సాగింది.

3.58 గంటలకు హెలికాప్టర్‌లో తొర్రూరు నుంచి హుస్నాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

హెలికాప్టర్‌ సభా ప్రాంగణంపై మూడు రౌండ్లు వేయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

దారులు చిన్నగా ఉండడం, ప్రజలంతా ఒకేసారి తరలి రావడంతో అన్ని రహదారులు స్తంభించాయి.

మహబూబాబాద్‌కు వెళ్లే రోడ్డులో పార్కింగ్‌ ఏర్పాట్లు చేయడంతో ప్రజలు కిలో మీటరు మేర నడిచి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

ప్రియాంకగాంధీ ప్రసంగానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

ప్రియాంకగాంధీ ప్రసంగిస్తున్నంత సేపు కేసీఆర్‌ను విమర్శించినా.. యశస్వినిరెడ్డిని అభినందించినా.. ఇందిరా గాంఽధీని గుర్తు చేసినా.. సభ హోరెత్తడంతో ప్రతిసారి ప్రసంగాన్ని ఆపిఆపి కొనసాగించాల్సి వచ్చింది.

చప్పట్లు, ఈలలు, కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది. కళాకారుల ఆటపాటలు ఉత్సాహం నింపాయి.

కాంగ్రెస్‌ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు, భారీగా పోలీసులను మోహరించారు.

– 8లోu1
1/3

– 8లోu

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement