● ప్రజాభిప్రాయాన్ని సేకరించిన
కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
ఓర్వకల్లు: గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1,200 మెగావాట్ల నుంచి 1,680 మెగావాట్లకు పెంచారు. ఈ నేపథ్యంలో గురువారం ఓర్వకల్లు మండలం పిన్నాపురంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి నేతృత్వంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో 30 కిలోమీటర్ల పరిధిలోని 10 గ్రామాల్లో పర్యావరణ పరిస్థితులపై అధ్యయనం చేపట్టామన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రీన్కో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఈ సందర్భంగా వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను తెలియజేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్ట్ మరింత విజయవంతంగా కొనసాగి పరిసర గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అనంతరం గ్రీన్కో ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు, అభివృద్ధి అవసరాలను కలెక్టర్‌తో చర్చించి, సంస్థ పరిధిలో సాధ్యమయ్యే కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా అమలు చేస్తామన్నారు. గుమ్మితంతండా గ్రామాన్ని తమ సొంత గ్రామంగా భావిస్తున్నామని, ప్రాజెక్టు ప్రారంభం నుంచి గ్రామ ప్రజల నుంచి మంచి సహకారం లభిస్తోందన్నారు. సమావేశంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రమేష్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిషోర్ రెడ్డి, గ్రీన్కో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


