ఏఐతో వైద్యంలో అద్భుతాలు | - | Sakshi
Sakshi News home page

ఏఐతో వైద్యంలో అద్భుతాలు

Nov 20 2026 1:37 AM | Updated on Nov 20 2026 1:37 AM

● ఏఐజీ హాస్పిటల్స్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో

ఎంట్రాలజిస్టు పద్మశ్రీ డాక్టర్‌ జీవీ రావు

కర్నూలు(హాస్పిటల్‌): వైద్యరంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) ముఖ్యభూమిక పోషిస్తోందని హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, పద్మశ్రీ డాక్టర్‌ జీవీ రావు అన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కర్నూలు బ్రాంచ్‌ ఆధ్వర్యంలో గురువారం కర్నూలు మెడికల్‌ కాలేజీలోని లెక్చరర్‌ గ్యాలరీలో డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి ఎండోమెంట్‌ అరేషన్‌ను నిర్వహించారు. జీర్ణకోశ వ్యాధుల పరిష్కారంలో ఏఐ ముఖ్యపాత్ర గురించి డాక్టర్‌ జీవీ రావు వివరించారు. నేటి వైద్య విధానంలో కేవలం 50 శాతం మంది రోగులకు ఉన్న వ్యాధులను కచ్చితంగా అంచనా వేయడానికి ’ఓమిక్స్‌’ డేటా, ఏఐ సహాయం తప్పనిసరి అయ్యిందన్నారు. సాధారణ ఎండోస్కోపీలో కనిపించని చిన్న కణుతులను ఏఐ గుర్తిస్తుందన్నారు. దీంతో నూతన వైద్యులు కూడా పొరపాట్లు చేయకుండా కచ్చితమైన చికిత్స చేసేందుకు వీలవుతుందన్నారు. ఎండో బ్రెయిన్‌ అనే మైక్రోస్కోప్‌, ఏఐ కలిసిన ఈ పరికరం ద్వారా, కణ జాలాన్ని కత్తిరించి ల్యాబ్‌కు పంపకుండానే, అక్కడికక్కడే అది క్యాన్సర్‌ గడ్డ అవునా.. కాదా అని చెప్పవచ్చని పేర్కొన్నారు. క్యాప్సూల్‌ ఎండోస్కోపీ విధా నం గురించి వివరిస్తూ గతంలో ఒక క్యాప్సూల్‌ రిపోర్ట్‌ చదవడానికి వైద్యులకు 6 నుంచి 8 గంటలు పట్టేదని, ఇప్పుడు ఏఐ నిమిషాల్లో ఆ చిత్రాలను విశ్లేషిస్తోందని చెప్పారు. ఖరీదైన ఫైబ్రోస్కాన్‌ యంత్రం అవసరం లేకుండా సాధారణ రక్త పరీక్షల రిపోర్టుల ఆధారంగానే ఏఐ అల్గారిథమ్‌ ద్వారా ఫ్యాటీ లివర్‌ తీవ్రతను 10వ వంతు ఖర్చుతోనే కచ్చితంగా అంచనా వేయవచ్చని తెలిపారు. రేడియాలజిస్టులు గుర్తించలేని, ప్రారంభ దశలో ఉన్న ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ను సైతం ఏఐ గుర్తిస్తోందని వివరించారు. శస్త్రచికిత్స చేసేటప్పుడు రక్తనాళాలు, నరాలు, పిత్తాశయ నాళాలు దెబ్బతినకుండా ఏఐ స్క్రీన్‌ మీద రంగులతో హెచ్చరిస్తుందని, దీనివల్ల ఆపరేషన్‌ సమయంలో రక్తస్రావం తగ్గి, రోగులు త్వరగా కోలుకుంటారని వివరించారు. భవిష్యత్తులో సర్జన్‌ కన్సోల్‌ వద్ద కూర్చుని ఆదేశాలు ఇస్తుంటే రోగి వద్ద ఒక హ్యూమనాయిడ్‌ రోబో ఆపరేషన్‌ను చేసే రోజులు రాబోతున్నాయని చెప్పారు. అంతకుముందు ఆయనకు డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి పేరున ఉన్న గోల్డ్‌మెడల్‌ను అధికారులు, వైద్యులు ఇచ్చి సన్మానించారు.

ఆ రోజుల్లో ప్రొఫెసర్లు కూడా సైకిళ్లపై వచ్చేవారు...

తనకు కర్నూలు మెడికల్‌ కాలేజీ అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానమని, తాను అక్కడ అండర్‌గ్రాడ్యుయేషన్‌ (ఎంబీబీఎస్‌) చదివే రోజుల్లో ప్రొఫెసర్లు, సీనియర్‌ వైద్యులు సైతం సైకిళ్లపై ఆసుపత్రికి వచ్చేవారని, సాయంత్రం వేళల్లో లైబ్రరీలు, ల్యాబ్‌లలో చదువుకుంటూ ఎంతో క్రమశిక్షణతో కూడిన శిక్షణ పొందామని నాటి జ్ఞాపకాలను ఆన్‌లైన్‌ ద్వారా డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఏఐజీ హాస్పిటల్‌లో అతి పెద్ద ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో తన సహద్యోగి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ జీవీ రావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

పేగుల ఆరోగ్యం బాగుంటేనే....

నేటి కాలంలో పేగుల ఆరోగ్యం బాగుంటేనే మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ చెప్పారు. మన మెదడులో ఎన్ని న్యూరా న్లు ఉన్నాయో...జీర్ణాశయ వ్యవస్థలో కూడా అన్ని నాడీ కణాలు ఉంటాయని, భావోద్వేగాలు తప్ప మిగతా శారీరక ఆరోగ్యాన్ని జీర్ణాశయమే నియంత్రిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హరిచరణ్‌, ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రామచంద్రనాయుడు, డాక్టర్‌ ఎస్వీ రామమోహన్‌రెడ్డి, డాక్టర్‌ మాధవీశ్యామల, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు డాక్టర్‌ బి.శంకరశర్మ, డాక్టర్‌ వెంకటరంగారెడ్డి, డాక్టర్‌ జి.మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement