ఎన్నికల వ్యయం రూ.3.30 కోట్లు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యయం రూ.3.30 కోట్లు విడుదల

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు రూ.3,30,00,410 మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు విడుదల చేసినట్లు ఎంపీటీసీ/ జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జెడ్పీ సీఈఓ ఆర్‌.సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 26 మండలాల్లో 1,432 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పాలనా వ్యవహారాలకు ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి రూ.5 వేలు, కార్యాలయ ఖర్చులకు రూ.2,500, పబ్లికేషన్‌, ప్రింటింగ్‌కు రూ.1000, వెహికల్‌ అద్దె చార్జీలకు రూ.500, ఫ్యూయల్‌ చార్జెస్‌ కింద రూ.500, ట్రావెలింగ్‌ అలవెన్స్‌ కింద ఆయా మండలాల్లోని పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి రూ.1,93,96,410 విడుదల చేశామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఈ మేరకు బడ్జెట్‌ విడుదలైందన్నారు. ఇందులోనే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బందికి టీఏ, డీఏ కింద రూ.1,93,96,410 విడుదల చేశామన్నారు.

18న మూడో విడత కౌన్సెలింగ్‌

కర్నూలు(హాస్పిటల్‌): ఏపీ స్టేట్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌(డిప్లమా కోర్సు) కోర్సులకు సంబంధించి వివిధ కేటగిరిలలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 18న జరిగే మూడో విడత కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కర్నూలు మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మూడో కౌన్సెలింగ్‌లో వేరొక కోర్సుకు మారడం ఉండదన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

కర్నూలు కల్చరల్‌: జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు జిల్లాలోని అన్ని గ్రంథాలయ శాఖల్లో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, సెక్రటరీ ప్రకాష్‌ తెలిపారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకు గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ వేడుకల ర్యాలీ, 15వ తేదీ ఉదయం 10 గంటలకు పుస్తక ప్రదర్శన, 16వ తేదీ ఉదయం 10 గంటలకు 6, 7 తరగతులకు ‘పౌర గ్రంథాలయాలలో కృత్రిమ మేధస్సు పాత్ర’, 8, 9, 10 తరగతులకు ‘నేర్చుకోవడానికి చదవండి – నాయకత్వం వహించడానికి నేర్చుకోండి’ అనే అంశాలపై వ్యాస రచన పోటీలు నిర్వహిస్తామన్నారు. గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించుకోవడం జరుగుతుందన్నారు. 17వ తేదీ ఉదయం 10గంటలకు చిత్రలేఖన పోటీలు, 18వ తేదీ ఉదయం 10 గంటలకు వక్తృత్వ పోటీలు, 19వ తేదీన క్విజ్‌ పోటీలు, 20వ తేదీన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఏర్పాటవుతాయన్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. పాఠకులు, విద్యార్థులు ఉత్సవాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

అధిక పాల ఉత్పత్తి

పశువులను గుర్తించండి

కర్నూలు(అగ్రికల్చర్‌): అధిక పాల ఉత్పత్తి ఆవులు, బర్రెలను గుర్తించాలని జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏహెచ్‌ఏలు, ఇతర పారా సిబ్బంది వెంటనే తమ పరిధిలో రోజుకు 12 లోటర్ల పాల ఉత్పత్తి ఉన్న ఆవులు, గేదెలను గుర్తించి నమోదు చేసి పంపాలన్నారు. ఇటువంటి పశువులను కర్నూలు డివిజన్‌లో 450, ఆదోని డివిజన్‌లో 550 గుర్తించి పంపితే ప్రభుత్వం మరింత పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపడుతుందన్నారు. గొర్రెలు, మేకలకు పీపీఆర్‌ వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ఈ నెల చివరిలోపు 100 శాతం పూర్తి కావాలన్నారు. గ్రామాల వారీగా పశుగ్రాసం కొరతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా పశుపోషణకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. సమావేశంలో కర్నూలు డివిజన్‌ డీడీ భవానిశంకర్‌రెడ్డి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డీడీ సుభాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement