కర్నూలు(సెంట్రల్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని స్థాయిల అధికారులు తమ బాధ్యతలను స్పష్టంగా తెలుసుకొని సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల ఏర్పాట్లు, పీజీఆర్‌ఎస్ సమస్యల పరిష్కారాలపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు సరిగా లేకపోవడంపై ఫిర్యాదులు వచ్చాయని, ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలన్నారు. రెండో విడత శిక్షణకు హాజరయ్యే సిబ్బందికి సంబంధిత మండలాలకు అవసరమైన ట్రైనింగ్ మెటీరియల్‌ను తప్పనిసరిగా అందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను 60 రోజుల పాటు భద్రపరచాలన్నారు. నామినేషన్ పత్రాల్లో అవసరమైన వివరాలన్నీ సక్రమంగా నమోదు చేసేలా అభ్యర్థులకు సహకరించాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఓ సి.వెంకట నారాయణమ్మ, డిపిఓ భాస్కర్, డ్వామా పిడి నరసింహా రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ సుధాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, సిపిఓ భారతి, డీటీసి శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.


