మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ప్రహ్లాదరాయల ఊరేగింపు వైభవంగా సాగింది. గురువారం ప్రత్యేక దినం కావడంతో ఉత్సవమూర్తికి ముందుగా ఊంజల మంటపంలో ప్రత్యేక ఊంజల, వింజామర సేవలు గావించారు. అనంతరం వెండి పల్లకీపై కొలువుంచి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఊరేగించారు. అంతకు ముందు స్వామి ముంగిట భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు జ్యోతి ప్రజ్వలనతో కార్తీక దీపోత్సవానికి అంకురార్పణ పలికారు. వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.


