ఎమ్మిగనూరురూరల్: పార్లపల్లి–పెసలదిన్నె గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం సాంబగల్లు గ్రామానికి చెందిన కురవ దస్తగిరి(23) ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామానికి చెందిన మహేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. మహేశ్వరి రెండు నెలల క్రితం కుమారుడికి జన్మనిచ్చింది. ఈ క్రమంలో సోమవారం కుమారుడిని చూసి తిరిగి ఆదోనికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో బైక్‌ను ఢీ కొనటంతో కురవ దస్తగిరి (23) తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్‌ఐ చెప్పారు.
క్వింటా వేరుశనగ రూ.8,869
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.8,869 ధర పలికింది. మార్కెట్‌కు 42 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.6,269, మధ్యస్థ ధర రూ.8,390 ప్రకారం మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
కోవెలకుంట్ల: మండలంలోని కలుగొట్లకు చెందిన ఓ మహిళ సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన మద్దమ్మ కొంతకాలం నుంచి మానసిక స్థితి సరిగా లేక జీవితంపై విరక్తి చెంది క్రిమి సంహారక గుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ ద్వారా నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్న ఘటనపై రేవనూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఘాట్‌రోడ్డులో వాహనదారులు అప్రమత్తం
● భక్తులకు కలెక్టర్ సూచన
శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చే భక్తులు ఘాట్ రోడ్‌లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఒక ప్రకటనలో సూచించారు. మురుసు తుపాన్ కారణంగా వర్షాలకు శ్రీశైలం – దోర్నాల ఘాట్ రోడ్డు, శ్రీశైలం – అమ్రాబాద్ ఘాట్ రోడ్లలో కొండ రాళ్లు రహదారిపై పడే అవకాశం ఉందని హెచ్చరించారు. తుపాను ప్రభావం ఉన్నందున మూడు రోజులు పాటు ఘాట్‌రోడ్డులో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలన్నారు. ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు స్పందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.
కల్లూరు ఎంఈఓ సస్పెన్షన్
కర్నూలు (సిటీ): నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం గడువు ముగిసిన తర్వాత వాట్సప్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ అభ్యర్థికి ఓటు వేయాలని సందేశం పోస్టు చేశారు. పోలింగ్‌కు ముందు రోజు ఈ సంఘటన జరిగినట్లు ‘సాక్షి’లో సోమవారం ‘ఎన్నికల ప్రచారంలో ఎంఈఓ’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి స్పందించారు. సదరు ఎంఈఓ ఎం.శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
కర్నూలు (టౌన్): స్థానిక ఏపీఎస్‌పీ క్యాంపు క్రీడా మైదానంలో సోమవారం రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 బాల బాలికల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. పోటీలను ఏపీఎస్‌పీ కమాండెంట్ సుధాకర్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం క్రీడలను ప్రోత్సహిస్తున్నాయని, విద్యా, ఉద్యోగాల్లో 3 శాతం వరకు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, డాక్టర్ సీ. వాసురెడ్డి, టోర్నమెంటు ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసులు, అరుణ, సుధాకర్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్యయ్య పాల్గొన్నారు.
కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
మంత్రాలయం రూరల్: చిలకడోణ గ్రామంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఓ వ్యకి గాయపడ్డాడు. వ్యవసాయ పనులు చేసుకునే గుజ్జుల గోవిందు అనే వ్యక్తి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో స్థానిక ఓ దుకాణంలో పెరుగు ప్యాకెట్ తీసుకొని రోడ్డు దాటుతుండగా ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. గాయపడిన గోవింద్‌ను స్థానికులు హైవే అంబులెన్స్‌లో ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించా రు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ తెలిపారు.


