● ఓటమి భయంతోనే టీడీపీ దాడులు
● వైఎస్సార్‌సీపీ నేతలు
ఎస్వీ, కోట్ల హర్ష, సతీష్
విష్ణు వర్గీయుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులను పరామర్శిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎస్‌ఈసీ మెంబర్ కోట్ల హర్ష, కోడుమూరు ఇన్‌చార్జి ఆదిమూలపు సతీష్, తీవ్రంగా గాయపడిన తులశాపురం ఎంపీటీసీ అభ్యర్థి రంగయ్య
కర్నూలు సిటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి గెలవడం చేతకాక..ఎన్నికలు సక్రమంగా జరిగితే ఓడిపోతామనే భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆ పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, కేంద్ర కమిటీ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, నియోజవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. కర్నూలు రూరల్ మండలంలోని బసాపురం ఎంపీటీసీగా పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బి.సరస్వతమ్మ, ఆర్.కొంతలపాడుకు చెందిన టి.ప్రవీణ్‌కుమార్ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి చేశారు. దాడిలో గాయపడి జనరల్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను వారు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారన్నారు. భయభ్రాంతులకు గురి చేసేందుకే ఇలాంటి దాడు లు చేస్తున్నారని, నిజాయితీగా కాకుండా ఏదో రకంగా గెలవాలనే పోలీసుల అండతో ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలు తిరగబడక ముందే పోలీసులు అప్రమత్తం కావాలన్నారు. ఇలాగే దాడులు చేస్తూ పోతే మళ్లీ కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రోజులు రాక మానవన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను పోలీసులు అడ్డుకోవాలని, లేకపోతే కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. గతంలో తాము నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజుల్లో తాము అడ్డుకొని ఉంటే బసాపురం ఎంపీటీసీతో పాటు పలు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసి గెలిచేవారు కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో దాడుల సంస్కృతి సరైంది కాదన్నారు. రేపటి రోజున తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్న దాడులకు పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవాలన్నారు. తమ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని న్యాయ స్థానాలను ఆశ్రయించగా, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సైతం స్పష్టమైన సూచనలు చేసిందన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో తులశా పురం ఎంపీటీసీ అభ్యర్థి రంగయ్య తీవ్రంగా గాయపడ్డారని, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆర్.కొంతలపాడు, సుంకేసుల గ్రామాల్లో నూ ఎన్నికల ప్రచారాన్ని అడుకుని దాడులు చేశారన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడితే హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్స్‌ను సైతం రాకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.


