● విద్యుదాఘాతంతో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి
మంత్రాలయం/రూరల్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, యజమాని అలసత్వం కారణంగా ఇద్దరు భవన కార్మికులు మృత్యువాత పడ్డారు. మంత్రాలయంలో ఓ లాడ్జి మూడో అంతస్తు నిర్మాణంలో భాగంగా సెంట్రింగ్ కోసం ఇనుప కడ్డీలు కింది నుంచి పైకి చేర్చుతుండగా ఈ ఘోరం జరిగింది. మంత్రాలయంలో నాగయ్య శెట్టికి చెందిన గురు గోవర్ధన్ లాడ్జిపై మూడో అంతస్తు నిర్మాణం జరుగుతోంది. పనులు చేయడానికి ఇంజినీర్ తారకేష్‌కు కాంట్రాక్టు ఇచ్చాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. ఆలూరు మండలం మొలగవళ్లి గ్రామానికి చెందిన బంగారు గొల్ల చిన్న ఈరప్ప (55), ఆస్పరి మండల కేంద్రానికి చెందిన చాకలి మహానంది (38), ఆస్పరికే చెందిన బోయ ఉరుకుందు (30) పనులు చేస్తున్నారు. సోమవారం ఉదయం లాడ్జి పక్క వీధిలో ఉంచిన ఇనుప కడ్డీలను మూడో అంతస్తుపైకి చేర్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కింది నుంచి చిన్న ఈరప్ప తాడుకు రెండు కడ్డీలు కట్టగా పైనుంచి మహానంది, ఉరకుందు లాగుతుండగా లాడ్జి పక్క నుంచి వెళ్లిన విద్యుత్ తీగలు తాకాయి. దీంతో మూడో అంతస్తులో ఉన్న ఇద్దరు విద్యుదాఘాతానికి గురై పైనుంచి కింద పడ్డారు. కింద పనిచేస్తున్న చిన్న ఈరప్పపై విద్యుత్ తీగ పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మహానంది, ఉరుకుందును 108లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహానంది పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఉరుకుంద ఎమ్మిగనూరు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. మృతుడు చిన్న ఈరప్ప కుటుంబం ప్రస్తుతం ఎమ్మిగనూరులోని లక్ష్మీపేటలో నివాసం ఉంటున్నారు. భార్య శకుంతల, కూతురు సువర్ణ, కొడుకు నీలకంఠప్ప ఉన్నారుమృతుడు మహానందికి ఇద్దరు భార్యలు ఉండగా ప్రస్తుతం ఆయన చిన్న భార్య లక్ష్మి, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో కలిసి మంత్రాలయంలోని అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో రేకుల షెడ్‌లో కాలం వెల్లదీస్తున్నాడు. ఇంటికి ఆసరాగా ఉన్న వ్యక్తులు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కార్మికుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మృతి చెందిన చిన్న ఈరప్ప, చాకలి మహానంది (ఫైల్)


