కర్నూలు(సెంట్రల్): మునిసిపల్ ఎన్నికలను అధికారులు ప్రజస్వామ్యబద్ధంగా నిర్వహించలేకపోయారని వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. టీడీపీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల నిబంధలను ఉల్లంఘించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. కల్లూరు పరిధిలోని రాఘవేంద్రనగర్‌లో కాటసాని కారును పోలీసులు నిలిపివేశారు. మరో కారు కోసం నడిరోడ్డుపైనే ఎండలో అరగంటపాటు ఆయన నిలబడాల్సి వచ్చింది. బీక్యాంపు రాజరాజేశ్వరి దేవాలయంలో సమీపంలో ఎస్వీ కారును నిలుపుదల చేశారు. దీంతో ఆయన కూడా మరో కారు కోసం అరగంటపాటు నడి రోడ్డుపైనే నిలవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. తాము ప్రయాణిస్తున్న కార్లకు వెహికల్ పాసులు తీసుకున్నా.. చిన్న సాంకేతిక కారణం చూపి వాటిని సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. ఏకంగా రెండు కార్లను సీజ్ చేయడం దారుణమన్నారు. ఇది ఒకరంగా ఎన్నికల నిబంధలను ఉల్లంఘించడం అవుతుందని చెప్పారు.
మంత్రి టీజీ, ఎమ్మెల్యే చరితల కార్లకు అనుమతులు ఉన్నాయా?
తాము ప్రయాణిస్తున్న కారును పోలీసులు సీజ్ చేయడంపై కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె కుమారుడు వెళ్తున్న వాహనాలకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. మంత్రి టీజీ భరత్ పెద్ద కాన్వాయ్‌లో పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్తున్నారని, వాటికి అనుమతులు ఉన్నాయని ఎస్వీమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఎన్నికల నిబంధలను యథేచ్ఛగా
ఉల్లంఘించారు
వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల
జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి,
కాటసాని రాంభూపాల్ రెడ్డి


