కర్నూలు సిటీ: కోడుమూరు నియోజకవర్గానికి చెంది.. నగరపాలక సంస్థ పరిధిలోని వార్డుల్లో ఆదివారం జరిగిన నగరపాలక ఎన్నికల్లో 51,52,53,54 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు స్వేచ్ఛగా తిరుగుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చి తమ అభ్యర్థికి ఓటేయాలని అభ్యర్థిస్తున్నా.. అక్కడే ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడం విశేషం. పోలింగ్ కేంద్రాల వద్దర స్థానిక యువతతో పాటు, స్థానికేతరులతో కలిసి గుంపులు గుంపులుగా హల్ చల్ చేశారు. బాలాజీ నగర్‌లోని 54వ వార్డు పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి జయచంద్రకు మద్దతుగా కొంత మంది యువకులు మద్యాహ్నం 3 గంటల తరువాత స్థానికేతరులతో ఓట్లేయించారు. విషయాన్ని కొందరు ఓటర్లు అక్కడే ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. దీంతో ఓటర్లు అక్కడి ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో స్థానికేతరులు అక్కడి నుంచి జారుకున్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు అక్కడికి చేరుకొని ఓట్లేయించాలని సూచించారు.. వాస్తవానికి ఎంపీ నగరపాలక సంస్థ పరిధిలోని ఓటరు కాదు. కాకపోయినా తన వెంట స్థానికేతర యువతతో వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో తిరగడం గమనార్హం. మామిదలపాడులోని పోలింగ్ కేంద్రాల్లో చివరి సమయంలో దొంగ ఓట్లు వేయించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరించి స్థానికేతరులతో ఓట్లు వేయించారు. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి యు.సుశీల, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ, కుమారులతో కలిసి 52వ వార్డులోని మునగాలపాడులో ఓటు హక్కును వినియోగించుకున్నారు.


