కర్నూలు జిల్లాలో వర్షాభావం వల్ల పూర్తిగా ఎండిపోయిన వేరుశనగ, గిడసబారిన పత్తి పంట
● నంద్యాల జిల్లాలో 28 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా గుర్తించారు. వర్షాభావం వల్ల రైతులు రూ.1,258.18 కోట్లు విలువ దిగుబడలు కోల్పోయినట్లు వ్యవసాయ అధికార యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారించింది. 2,07,340 మంది రైతులు ఎల్‌నినో బాధితులుగా ఉన్నారు.
● కర్నూలు జిల్లాలో 1,68,495.47 హెక్టార్లలో పంటలు ఎల్‌నినో ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంటలకు కనీస మద్దతు ధరల ప్రకారం రూ.710.26 కోట్ల నష్టం వాటి ల్లింది. 1,85,515 మంది రైతులు ఎల్‌నినో బాధి తులుగా ఉన్నారు. జిల్లాలో 12 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించలేదు.
కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు ఆరు దశాబ్దాల్లో ఎపుడూ లేని విధంగా 2026–27 సంవత్సరంలో వ్యవసాయాన్ని ఎల్‌నినో మింగేసింది. కరువు విలయతాండవం చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఇసుమంత కూడా చేయూత దక్కక పోవడంతో అన్నదాతల పరిస్థితి దయనీయమైంది. ఒకవైపు అడ్డుగోలుగా పెరిగిపోతున్న ధరలు, మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తాగునీటి సమస్య, ఇంకోవైపు పశుగ్రాసం కొరత రైతులు, ఇతర వర్గాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఖరీఫ్ ఎత్తిపోయినా... రబీ సీజన్ ఆదుకుంటుందనే ఆశ సహజంగా రైతుల్లో ఉంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రబీ సీజన్ కూడా లేకుండా పోయింది. రబీ మొదలై నెల రోజులైనా ఇంతవరకు రబీ పంటల సాగు 1000 హెక్టార్లకు మించలేదు. ఎల్‌నినో ప్రభావం వల్ల జూన్ నుంచి వర్షాలు లేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం మెరుగ్గా ఉన్నప్పటికీ దిగుబడులు పూర్తిగా తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఉమ్మడి జిల్లాలో 3,92,855 మంది రైతులు కరువు పీడిత బాధితులుగా మిగిలారు. రబీలో అస్సలు కాడి పట్టే పరిస్థితే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నెలకొన్న కరువును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేంద్రం బృందం నవంబరు 2, 3 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనుంది. కేంద్ర బృందానికి పరిస్థితిని చెప్పుకోవడానికి రైతులు, రైతుసంఘాలు, అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో అధికార వర్గాల సమాచారం ప్రకారం 726 పంచాయతీల్లో నీటి సమస్య జఠిలమైంది. పశ్చిమ ప్రాంతంలో రెండు వారాలకు ఒక్కసారి కూడ నీళ్లు ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. భూగర్భ జలాలు గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 3.56 మీటర్ల అడుగుకు పోవడంతో నీటి సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. కర్నూలు జిల్లాలో 286, నంద్యాల జిల్లాలో 316 చెరువులు ఉన్నా.. చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో పంట దిగుబడుల నష్టం రూ.1,968.44 కోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా వ్యవసాయ యంత్రాంగం అంచనా వేసింది.
రెండు రోజులు సెంట్రల్ టీమ్ పర్యటన..
ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం కేంద్రం కరువు ప్రాంతాలకు నిధులు విడుదల చేసే ముందు ప్రత్యేక బృందాన్ని ఆయా జిల్లాలకు పంపుతుంది. ఇందులో భాగంగా ముగ్గురు ఉన్నతాధికారుల బృందం నవంబరు నెల 2, 3 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు షెడ్యూలు ఖరారు అయ్యింది. ఐదుగురు సభ్యులు కలిగిన కేంద్ర బృందం ఉమ్మడి జిల్లాలో పర్యటించనుంది. కేంద ప్రభుత్వ డీవోడీ డైరెక్టర్ కే.పోనుసామి బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఎన్ఐటీఐ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ బి. అనురాధ, ఎన్‌పీఎంయూ – పీహెచ్ఈ ఆర్ఐసీ ధీరేంద్రకుమార్, ఫుడ్ అండ్ పీడీ సెక్రటరీ ప్రదీప్‌కుమార్, కేంద్ర పశుసంవర్ధక శాఖ అధికారి బదూరీయా సెంట్రల్ టీమ్‌లో ఉన్నారు. 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం జిల్లా నుంచి తుగ్గలి మండలం జి.ఎర్రగుడికి సెంట్రల్ టీమ్ చేరుకుంటుంది. ఇదే మండలంలోని పగిడిరాయి, మద్దికెర మండలంలోని పెరవలి, పత్తికొండ మండలంలోని చిన్నహుల్తి, జూటూరు గ్రామాల్లో కరువు పరిస్థితులను పరిశీలిస్తుంది. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడుతారు. తర్వాత కర్నూలు చేరుకొని కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో ఫొటో ఎగ్జిబిషన్ తిలకించడంతో లైన్ డిపార్టుమెంటు అధికారులతో కరువు పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. 3వ తేదీ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.
ఖరీఫ్, రబీ పంటలను
మింగేసిన ఎల్‌నినో
ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షల
హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
తీవ్రతరమవుతున్న నీటి సమస్య,
పశుగ్రాసం కొరత
రేపటి నుంచి సెంట్రల్ బృందం
పర్యటన


