ధరలు నియంత్రిస్తానని రెండింతలు చేశారు
బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం
ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓటేద్దాం
2029లో వచ్చేది జగనన్న ప్రభుత్వమే
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య
కర్నూలు (టౌన్): అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ధరలను నియంత్రిస్తానని ఎన్నికల్లో చెప్పి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు ఓటుతో బుద్ధి చెపాల్పని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ బీవై రామ య్య ఓటర్లకు పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక గణేష్‌నగర్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్‌తో పాటు నిత్యావసరాల సరుకుల ధరలు విపరీతంగా పెంచారన్నారు. జగనన్న హయాంలో కిలో బియ్యం రూ.50 ఉంటే ప్రస్తుతం రూ.100కు చేరుకుందన్నారు. కందిపప్పు రూ.100 నుంచి రూ.180, ఉల్లిగడ్డలు రూ.20 నుంచి రూ.80.. అన్నీ పెరగడంతో పేదల జీవనం భారంగా మారిందన్నారు. సామాన్య ప్రజలపై ధరల భారం పెంచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడాబాబులకు కార్పొరేట్లకు మాత్రం 99 పైసలకే ఎకరాల కొద్ది భూములు కట్టబెట్టారన్నారు. ‘మా ఇష్టం వచ్చినట్లు భూములు కేటాయిస్తాం’ అని మంత్రి లోకేష్ చెప్పడం విడ్డూరంగా ఉందని, ప్రభుత్వభూములన్నీ బాబు జాగీరా’ అని ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల రూ.1500 ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు.
బీసీలను దగా చేసిన చంద్రబాబు..
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో తామే ఉన్నా మని చెప్పే చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు చట్టబద్ధత తీసుకురాలేదన్నారు. బీసీలందరూ ఆలోచించాలన్నారు. చెప్పిన వి చేయకపోవడం చంద్రబాబు నైజమన్నారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేషన్ కమిటీ పేరుతో రెండేళ్లు కాలయాపన చేసి మోసం చేశారన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికల్లో హింస, దౌర్జ న్యాలు, నామినేషన్లు చించేయడం, దాడులు చేయడం, మహిళలను సైతం తీవ్రంగా ఇబ్బందులు పెట్టారన్నారు. కార్ల దహనాలు, గృహ దహనాలు, హత్యాయత్నాలు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఆదివారం జరిగే మున్సిపల్ ఎన్నికలు, నవంబర్ 5న జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లు చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలన్నారు. 2029లో వచ్చేది జగనన్న ప్రభుత్వమే అన్నారు.
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీరాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య


