కర్నూలును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా | - | Sakshi
Sakshi News home page

కర్నూలును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

● వైఎస్సార్‌సీపీ కర్నూలు మేయర్‌ అభ్యర్థిగా సుశీల నామినేషన్‌

కర్నూలు(టౌన్‌): కర్నూలును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థి సుశీల అన్నారు. శనివారం ఆమె స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ అభ్యర్థిగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హపీజ్‌ఖాన్‌, మణిగాంధీతో కలిసి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి వేణుగోపాల్‌కు సమర్పించారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. కర్నూలు నగరంలో డ్రైనేజీ సమస్య, ఇప్పటికీ అనేక కాలనీలలో తాగునీటి సమస్య ఉందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు పూర్తి చేయకపోవడం, రద్దు చేయడం తప్ప కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను విస్మరించారన్నారు. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తన గెలుపునకు నాంది పలుకుతుందన్నారు.

● పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు. గెలవలేమని తెలిసే కడప, రాయచోటి, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో టీడీపీ గుండాలతో భయోత్పాతం సృష్టిస్తున్నారన్నారు. భయపెడితే భయపడే పరిస్థితి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో లేదన్నారు. సూపర్‌ సిక్స్‌ వైఫల్యాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రచారంలో ప్రజలే కూటమి నేతలను నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం తథ్యమన్నారు.

● కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కర్నూలు మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి దౌర్జన్యాలు చేయ లేదన్నారు. అధికారంలో ఉన్నా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించామన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో హామీలను ప్రశ్నిస్తారనే భయంతో టీడీపీ దాడులకు తెగపడుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యులు కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు అహమ్మద్‌ అలీఖాన్‌, కోడుమూరు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సతీష్‌, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement