● పలు పంచాయతీల రిజర్వేషన్లపై
కలెక్టర్‌కు ఫిర్యాదులు ?
● జేసీ ఆధ్వర్యంలో మరోసారి పరిశీలన
కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల రిజర్వేషన్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. పక్కనున్న నంద్యాల జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ ఈ నెల 14వ తేది రాత్రికి పూర్తయింది. కర్నూలు జిల్లాలో కూడా 14వ తేది ఉదయం నుంచి 15వ తేది ఉదయం వరకు జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో ఆర్డీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, డీపీఓ కార్యాలయ సిబ్బంది జనాభా, ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి రిజర్వేషన్ల ప్రక్రియను గురువారం ఉదయానికి పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఆమోదంతో సాయంత్రానికి గెజిట్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు అందరూ భావించారు. అయితే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియను మరోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జేసీ నూరుల్‌ఖమర్ జిల్లా పరిషత్‌కు చేరుకొని కర్నూలు, ఆదోని, పత్తికొండ ఆర్డీఓలతో పాటు డీపీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలతో రిజర్వేషన్లపై అనుభవం ఉన్న జెడ్పీ ఉద్యోగులను సమావేశపరిచి రిజర్వేషన్ల ప్రక్రియను మరోసారి పరిశీలిస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టారా ? లేదా ? అనే విషయాలను స్వయంగా ఆయనే పరిశీలిస్తున్నారు. రిజర్వేషన్ల గెజిట్ ఆలస్యం కావడం పట్ల రాష్ట్ర పీఆర్అండ్ఆర్డీ కార్యాలయం నుంచి కూడా ఇక్కడి పరిస్థితులను వాకబు చేస్తున్నట్లు సమాచారం. కాగా, రిజర్వేషన్ల ప్రక్రియలో తప్పుడు దొర్లినట్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడం వల్లే ఈ ప్రక్రియను మరోసారి పరిశీలించాలని జేసీని ఆదేశించినట్లు సమాచారం.


