ఇల కై లాసం.. ఉత్సవ శోభితం! | - | Sakshi
Sakshi News home page

ఇల కై లాసం.. ఉత్సవ శోభితం!

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

శ్రీశైలంటెంపుల్‌: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు, కుమారీపూజ, సుహాసిని పూజ తదితర విశేష కార్యక్రమాలను నిర్విఘ్నంగా సాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ నీరాజనాలు సమర్పించారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గురువారం శ్రీశైల భ్రమరాంబాదేవిని స్కందమాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక అలంక్రీకృతులైన అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉంచి ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. నవదుర్గలలో ఐదవ రూపమైన ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి, ఒక చేతిలో స్కందుణ్ణి పట్టుకుని ఉండి, మిగిలిన చేతుల్లో పద్మాలను, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈమె ఒడిలో బాలుని రూపంలో స్కందుడు (కుమారస్వామి) కూర్చొని ఉంటాడు. స్కందదేవుని జనని కావడం వలన ఈ దుర్గాస్వరూపం స్కందమాతగా ప్రసిద్ధి చెందింది. స్కందమాతను ఉపాసించడం వలన స్కందదేవుని కూడా ఉపాసన చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ దేవిని ఆరాధించడం వలన సకల కోర్కెలు నెరవేరడంతో పాటు శాంతి సౌఖ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

శేష వాహనంపై మల్లన్న విహారం

దసరా మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గురువారం రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లు శేష వాహనంపై విహరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. శేషవాహనంపై ప్రత్యేకంగా అలంకరించిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్కందమాత స్వరూపంలోని అమ్మవారిని, శేషవాహనంపై అధిష్టించిన స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించి నీరాజనాలు సమర్పించారు. స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం కనుల పండువగా సాగింది.

స్కందమాతగా

శ్రీశైల భ్రామరీ దర్శనం

శేష వాహనంపై

ఆదిదంపతుల విహారం

స్వామిఅమ్మవార్లను దర్శించుకుని

పులకించిన భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement