మరోసారి ‘సర్‌’ గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

మరోసారి ‘సర్‌’ గడువు పొడిగింపు

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

● 30న తుది ఓటరు జాబితా ప్రచురణ

కర్నూలు(సెంట్రల్‌): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) గడువును మరోసారి పొడిగించారు. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారానికి అక్టోబర్‌ 22వ తేదీ వరకు గడువు పొడిగించగా తుది జాబితాను అక్టోబర్‌ 30న విడుదల చేయనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ఏ.సిరి గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. పొడిగించిన గడువును ప్రతి అర్హత కలిగిన ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల ఇంటింటా సర్వే సమయంలో ఇంట్లో లేని వారు లేదా తమ వివరాలు నమోదు కాలేదని భావించిన వారు సంబంధిత బీఎల్‌ఓ, ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓ కార్యాలయాలను సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.

రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఆత్మ నిర్భరత– పప్పు ధాన్యాల అభివృద్ధి పథకం కింద ప్రత్యేకంగా శనగ సాగు చేపడుతున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ఎన్‌బీఈజీ–452 రకం శనగ విత్తనాలు 1,500 క్వింటాళ్లు కేటాయించినట్లు చెప్పారు. వీటిని రైతులకు 75 శాతం రాయితీ లేదంటే క్వింటాకు రూ.6000 వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. శనగ పంట సాగు చేయాలనుకునే రైతులు సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు.

మెరుగైన తపాలా సేవలే లక్ష్యం

కర్నూలు(అర్బన్‌): ప్రజలకు మెరుగైన తపాలా సేవలు అందించడమే లక్ష్యమని కర్నూలు డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జి.జనార్దన్‌రెడ్డి అన్నారు. జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా గురువారం ‘ఒకే తపాలా నెట్‌వర్క్‌–అపరిమిత అవకాశాలు’ నినాదంతో కర్నూలు డివిజన్‌ తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్ట్‌థాన్‌ వాక్‌ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రధాన తపాలా శాఖ కార్యాలయం నుంచి మొదలైన ర్యాలీ కిడ్స్‌ వరల్డ్‌ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు సాగింది. ఈ సందర్భంగా పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం, శారీరక ధృడత్వంపై అవగాహన పెంపొందించడం, సిబ్బందిలో ఐకమత్యాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో కర్నూలు డివిజన్‌ పరిధిలోని వివిధ తపాల కార్యాలయాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘ఓపెన్‌’ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

కర్నూలు సిటీ: ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ ఎల్‌.సుధాకర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌ స్కూల్‌)ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. 14 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా 10వ తరగతిలో అడ్మిషన్‌ పొందవచ్చునని తెలిపారు. 15 సంవత్సరాలు నిండి 10వ తరగతి పాసైన వారు ఇంటర్మీడియెట్‌లో అడ్మిషన్‌ పొంది ఒక ఏడాదిలోనే పూర్తి చేసుకోవచ్చునన్నారు. మీసేవా/ఏపీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఫోన్‌ నంబరుకు వచ్చిన మెసేజ్‌ ఆధారంగా అభ్యర్థి స్వయంగా ఆన్‌లైన్‌లో అడ్మిషన్‌ ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి సమాచారం కోసం www.apopenschool.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని డీఈఓ పేర్కొన్నారు.

ఐదుగురు సూపర్‌వైజర్లకు పదోన్నతి

కర్నూలు (అగ్రికల్చర్‌): మార్కెటింగ్‌ శాఖలో ఐదుగురు సూపర్‌వైజర్లకు అసిస్టెంట్‌ సెక్రటరీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు చేశారు. కర్నూలులో పనిచేస్తున్న కేశవరెడ్డి, శివన్నకు కోవెలకుంట్ల, బనగానపల్లె మార్కెట్‌ కమిటీలకు అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమించారు. అలాగే కోవెలకుంట్లలో పనిచేస్తున్న ఎస్‌ శ్రీనివాసరావుకు పత్తికొండ, నందికొట్కూరులో పనిచేస్తున్న రామచంద్రయ్యకు ఆళ్లగడ్డలో నియమించారు. ఆదోనిలో పనిచేస్తున్న ఎం శ్రీనివాసులకు అక్కడే అసిస్టెంట్‌ సెక్రటరీగా పదోన్నతి లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement