● టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక
కల్లూరు: కల్లూరు అర్బన్‌లో టీడీపీకి షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. శనివారం తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షుడు వడ్డే రవితో పాటు కల్లూరు అర్బన్ 45వ వార్డు టీడీపీ నాయకులు స్వాములు, అంజితో పాటు పది కుటుంబాల సభ్యులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వీరందరికీ వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని శివనరసింహారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరడమే లక్ష్యంగా నాయకులందరూ సమష్టిగా పని చేయాలన్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 68 వార్డుల్లో బరిలో నిలిచే వైఎస్సార్సీపీ అభ్యర్థులు, మద్దతుదాలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మిడ్తూరు శ్రీనివాసులు, సాపూరి వీరయ్య, కాశన్న, హనుమంతయ్య, సుభాన్, కుమ్మరి వెంకటేశ్వర్లు, నవీన్‌రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


