కర్నూలు(హాస్పిటల్): ఓ మహిళ అవయవదానం మరో ముగ్గురికి ప్రాణం పోసింది. నంద్యాలకు చెందిన రవణమ్మ(36) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. ఆమె గత నెల 30న పా ణ్యంకు ఆటోలో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమా దం అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులను జీవన్‌దాన్ ట్రస్ట్ సభ్యులు అవయవదానానికి ఒప్పించారు. శుక్రవారం ఆమెను కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకొచ్చి అవయవాలను సేకరించే శస్త్రచికిత్సను యురాలజిస్టు డాక్టర్ అబ్దుల్ సమద్, నెఫ్రాలజిస్టు డాక్టర్ సిద్దార్థ్ హెరూర్ నిర్వహించారు. అనంతరం పోలీసుల సహకారంతో గ్రీన్‌ఛానల్ ద్వారా ఒక కిడ్నీని మెడికవర్ హాస్పిటల్‌కు, కాలేయాన్ని గౌరిగోపాల్ హాస్పిటల్‌కు, మరో కిడ్నీని నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ కర్నూలు హెడ్ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రవణమ్మ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ అవయవదానానికి ముందుకు రావడం ఎంతో గొప్ప మానవతా నిర్ణయమన్నారు. ఒక వ్యక్తి మరణానంతరం కూడా ఆమె అవయవాల ద్వారా ఇతరులకు జీవించే అవకాశం కల్పించడం నిజంగా గొప్ప విషయమన్నారు.


