ఆదోని సెంట్రల్: క్రీడాపోటీల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆర్‌డీఓ అరుణాదేవి అన్నారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం కర్నూలు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్(కేడీఏఏ) అధ్వర్యంలో 41వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్–2026 పోటీలు ప్రారంభమయ్యాయి. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ముందుగా అథితులతో జ్యోతి ప్రజ్వలన చేయించారు. రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి వచ్చిన 1,556 మంది క్రీడాకారులు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‌డీఓ మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమన్నారు. డీఎస్‌పి వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరస్పాండెంట్ దైవాధీనం రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు కంబిరెడ్డి, ఎర్రిస్వామి అథ్లెటిక్స్ కోచ్ హర్షవర్ధన్, కళాశాల ప్రిన్సిపాల్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.


